GHMC | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మండిపడ్డారు. చట్టసభలు పెట్టాలంటే కోర్టును కోరాల్సి రావడం దౌర్భాగ్యమన్నారు. గ్రేటర్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుక్కకాటు, నాలా పనుల నిర్లక్ష్యం, ఇంజినీరింగ్ పనుల్లో నిర్లక్ష్యం, అవినీతి అధికారుల రాజ్యం కొనసాగుతున్నదని మండిపడ్డారు.
ఏండ్ల తరబడి జీహెచ్ఎంసీలోనే డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారన్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కమిషనర్‌కు కౌన్సిల్ ఇష్టం లేదని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమావేశం పెట్టాలని చెప్పినా.. కమిషనర్ కావాలనే సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్ మహాలక్ష్మి ఆరోపించారు. మేయర్‌కు కమిషనర్ కనీసం గౌరవం ఇవ్వడం లేదన్నారు. కమిషనర్ రోనాల్డ్ రాస్ వైఖరిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.