బండ్లగూడ, జూలై 25 : ఓ ఫుడ్‌కోర్టు వ్యాపారి నుంచి ఐదు లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి అడ్వాన్స్‌గా 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం….జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రవి కుమార్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని ఓ ఫుడ్ కోర్టులో అక్రమాలు ఉన్నాయని తనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సదరు వ్యాపారి తమకు ఫిర్యాదు చేయడంతో పాటు డిప్యూటీ కమిషనర్ చాంబర్‌కు వెళ్లి తన వద్ద ఉన్న రెండు లక్షల రూపాయలను అందజేశాడు.
ఆ డబ్బు తీసుకున్న డిప్యూటీ కమిషనర్‌ను ఈ డబ్బులు ఎందుకు తీసుకున్నారని అడిగితే సరైన సమాధానం చెప్పలేక పోయారని పేర్కొన్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌పై గత కొంత కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయని, కాని సరైన ఆధారాలు లేక పోవడంతో విచారణ జరుపుతూ వస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ కమిషనర్ రవికుమార్ మొదటి నుంచి కూడా పనులు సక్రమంగా నిర్వర్తించక పోగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపించారు.