రవీంద్రభారతి,ఆగస్టు2: శ్రీశైలంలో ప్రాంతాల పేరుతో నిత్యం దౌర్జన్యం చేస్తూ, హత్యాయత్నానికి కూడా వెనకాడకుండా, ఒక మహిళా అధ్యక్షురాలు అని చూడకుండా సోషల్ మీడియాలో అసభ్య పదజాలలు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ,ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీశైలం కౌండిన్య గౌడ సత్రం(ఆర్య,గౌడ,ఈడిగ అసోసియేషన్)అధ్యక్ష, కార్యదర్శులు అనురాధ, పాండురంగంగౌడ్, మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
శనివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాత కమిటీ కౌండిన్య గౌడ సత్రం నిర్వహణలో బ్యాంకు అకౌంట్ లేకుండా, డబ్బును దోచుకోవడం,సత్రాలకు సరైన పర్యవేక్షణ చేయాల్సిన శ్రీశైలం దేవస్థానం అధికారులు నిర్వహణ లోపం వల్ల కౌడిన్య గౌడ సత్రం చాలా నష్టానికి గురైందన్నారు.చివరకు కౌండిన్య గౌడ సత్రం వృద్ధాశ్రమం నిర్మాణం 4 సంవత్సరాల కాలంగా ఆగిపోయిందన్నారు.
తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మహిళా కౌండిన్య గౌడ సత్రానికి అధ్యక్షురాలుగా అనురాధ ఎన్నిక కావడం ఇష్టంలేని, గత పాత కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొర్రపాటి, విజయ్‌కుమార్,బుర్రా సత్యనారాయణ తమ అనుచరులతో దుర్భాషలాడుతూ, వాహనాలను వెంబడించడం, చంపుతామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
కొన్ని నెలలుగా శ్రీశైలం కౌండిన్య గౌడ సత్రం కౌంటర్లో వారి అనుచరులు ప్రతి రోజు దౌర్జన్యంగా నగదును దోచుకొని వెళ్తుంటే దానిపై అనేక మార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినప్పటికి స్థానిక శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ప్రసాద్‌రావు పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందన్నారు.
అధ్యక్ష,కార్యదర్శులు అనురాధ,పాండురంగంగౌడ్, గుండ్ల మల్లికార్జున్‌లపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ చంపుతామని బెదిరించిన ఉసిరికాయల సిద్ధార్థగౌడ్, మాజీ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు కొర్రపాటి, విజయ్‌కుమార్, బుర్ర సత్యనారాయణలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌కు, దోమలగూడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తక్షణమే రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలు స్పందించి శ్రీశైలంలో జరుగుతున్న అరాచకాలను ముఖ్యంగా తెలంగాణ ప్రజలపై చూపుతున్న వివక్షను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఆత్మకూరి శ్రీనివాస్‌గౌడ్, రవీందర్, శ్రవణ్‌కుమార్, రాజన్న,గంగపురం పద్మ, ప్రజ్వల, శైలజ,రామన్న ,విజలక్ష్మి పాల్గొన్నారు.