నాంపల్లి క్రిమినల్ కోర్టులు/ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన రద్దయింది. రేవంత్ ఓయూకు వస్తారని తెలిసినప్పటి నుంచి వివిధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓయూ గడ్డపై ఆయనను అడుగు మోపనీయబోమని హెచ్చరించాయి.
ఇరవై నెలల పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన తరువాతే ఓయూకు రావాలని హితవు పలికాయి. ఒక వైపు వర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా, మరోవైపు నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని వర్సిటీకి వస్తారని ప్రశ్నించాయి. విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై నిలదీశాయి.
సీఎం పర్యటనపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. విలేకరుల సమావేశం కూడా నిర్వహించనీయకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన విద్యార్థి నేతలు ఎక్కడ కనిపించినా పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని అర్థరాత్రి సమయంలో విడుదల చేశారు.
అత్యంత పటిష్ట పోలీసుల బందోబస్తు మధ్య పర్యటనను పూర్తి చేసుకుందామని రేవంత్ భావిస్తున్నట్లు పలువురు చర్చించుకున్నారు. కానీ, ఓయూలో పర్యటిస్తే పరిస్థితి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో రేవంత్‌రెడ్డి అప్రమత్తమయ్యారు. పర్యటనను రద్దు చేసుకునేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు తెలంగాణకు చెందిన సుదర్శన్‌రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి హాజరవ్వడం ఓ కారణంగా దొరికింది. దీనిపై వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాము ముఖ్యమంత్రి పర్యటనను స్వాగతిస్తామని, కానీ అది ఓయూ సమస్యలను పరిష్కరించిన తరువాతేనని స్పష్టం చేస్తున్నారు.కాగా, సీఎం రాకను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై నిరసనలు వ్యక్తం చేయడంతో విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ఎస్ 35(3) కింద నోటీసులు జారీ చేయాలని బీఆర్ఎస్ లీగల్ సభ్యులు జక్కుల లక్ష్మణ్ చెప్పారు. 7 ఏండ్ల లోపు శిక్షలున్న సెక్షన్ల ప్రకారం నోటీసులు జారీ చేయాలని పట్టుబట్టారు. దీంతో విద్యార్థులకు నోటీసులు జారీ చేయడంతో పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యారు.