కంటోన్మెంట్, డిసెంబర్ 3: దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డులకు ఐదు సంవత్సరాలకు పైగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవ్వడంతో పాటు ఎన్నిక కాని సివిలియన్ నామినేటేడ్ సభ్యులతో పరిపాలించడానికి పదే పదే నోటిఫికెషన్లు వెలువరిస్తుండటంతో ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. దేశంలోని 60 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహించాలని.. ఢిల్లీ , ఆగ్రా కంటోన్మెంట్లకు చెందిన సందీప్ తన్వర్, యోగేష్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. వారి తరపున న్యాయవాదులు హైకోర్టులో ఎన్నికల నిర్వహణ అంశంపై తమ వాదనలు వినిపించారు.
దేశంలో 60 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయని బోర్డు సభ్యులను ఎన్నుకునే ఎన్నికలు 2015లో జరుగగా బోర్డు సభ్యుల పదవీ కాలం 2020లో ముగిసాయని,ప్రజాసామ్య బద్ధంగా ఎన్నికైన వారు ప్రజలను పరిపాలించాలని ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అధికార దుర్వినియోగం చేయడమేనని వాదనలు విన్న డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావు వాఖ్యనించారు. 2006 కంటోన్మెంట్ చట్టం సెక్షన్ 12 ప్రకారం ఎన్నికైన సభ్యులతో కంటోన్మెంట్ బోర్డులు కొనసాగాలని మనం ప్రజాస్వామ్య సమాజంలోజీవిస్తున్నామని మనకు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన పాలన ఉండాలని కోర్టు పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 13 కింద రాజ్యాంగాన్ని మార్చడానికి, ఎన్నికలు నిర్వహించకుండా నోటిఫికేషన్లు జారిచేస్తోందని న్యాయమూర్తులు వాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వానికి నోటీసుల జారీ..
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బోర్డుల ద్వారానే బోర్డులు పనిచేయాలని చట్టం చెబుతున్నపుడు సెక్షన్ 13 కింద పదేపదే నోటిఫికేషన్లు ఏలా ప్రకటించవచ్చో వివరిస్తూ తమ సమాధానాలను ధాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు డైరక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ)కి నోటీసులు జారీ చేయాలని సూచించడంతో పాటు 2026 మార్చి 11లోపు వారి నిర్ణయం వెలువరించాలని కోర్డు ఆదేశించింది. ఈ పిటిషన్ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించబోమని కోర్టు తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ భారత ప్రభుత్వం తరపున సత్యరంజన్ స్వైన్ హాజరై కంటోన్మెంట్ బోర్డుల పౌర ప్రాంతాలను సమీపంలో ఉన్న మున్సిపాలిటీలలో చేర్చాలనే పలు రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రతిపాదనపై ఒప్పందం కుదరని కారణంగా ఎన్నికలు ఆలస్యం అయ్యాయని కోర్టుకు తెలిపారు. అయితే మార్చి 11న దేశంలోని కంటోన్మెంట్లకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక వాటన్నిటిని మున్సిపాలిటీలలో విలీనం చేస్తారా? తేల్చాలని న్యాయమూర్తులు అధికారులకు సూచించారు.