Deer | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జింక మాంసం కలకలం సృష్టించింది. జింక మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
టోలిచౌకీ వద్ద శనివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న జింక మాంసం, మూడు కొమ్ములు, ఐదు రైఫిల్స్ పట్టుబడ్డాయి. వీటిని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని (AP09BT4716) పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు నిందితులు మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
జింక మాంసాన్ని, కొమ్ములను పోలీసులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వాహనాన్ని సీజ్ చేసి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామన్నారు. వన్యప్రాణులను రక్షించేందుకు ప్రజలు సహకరించాలని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు.