Deer Dies | కందుకూరు, మే 25 : రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర జంతువు జింక మృతి చెందింది. హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని రాచులూరు గేటు సమీపంలో గల పెద్దమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన జింక రోడ్డుపై పడి ఉండడంతో సమాచారం అందుకున్న గుమ్మడవెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం రాచులూరు పశువైద్యాధికారి షాహిన్ షేక్‌కు సమాచారం అందజేసి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన మృతి చెందినది మగ జింకగా నిర్ధారణ చేసి అనంతరం పోస్టుమార్టం నిర్వహించి ఫారెస్ట్ ఆఫీసర్‌కు అప్పగించారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి, గుమ్మడవెల్లి ఫారెస్ట్ భూమిలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారుల వెంట వెళ్లే వాహనాలు ఫారెస్ట్ ఉన్నచోట నిదానంగా వెళ్లాలని సూచించారు. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నట్లయితే వాటిని పరిశీలించి వాహనాన్ని గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు.