మేడ్చల్, నవంబర్26 (నమస్తే తెలంగాణ): దీక్షా దివస్‌ను విజయవంతం చేయాడంతో పాటు నేటి తరానికి దాని ప్రాముఖ్యతను తేలియజేయాలని నిర్వహించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కోరారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమ నిర్వహణపై ఎమ్మెల్యేలు.. మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ మొక్కవోని దీక్షతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షతను తొలగించాలంటే స్వరాష్ట్ర ఏర్పాటే మార్గమని గుర్తించి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన 29 నవంబర్ 2009 రోజు దీక్షా దివస్ అని గుర్తుచేశారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దీక్షా దివస్‌ను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరుల త్యాగం, కేసీఆర్ దీక్ష వలనే స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ వాల్ పోస్టర్‌ను నేతలు ఆవిష్కరించారు.
శంషాబాద్ రూరల్, నవంబర్ 26: హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందని మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో సబితారెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారథ్యంలో పదేళ్ల పాటు రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడింపించామన్నారు.
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ నాడు దీక్ష చెపట్టడంతోనే కేంద్రం నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందన్నారు. ఈనెల 29న ఉదయం 8 గంటలకు జిల్లాలోని గ్రామాలు, వార్డులలో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతో పాటు 10 గంటలకు శంషాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, రైతుబంధు మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరక్టర్ బుర్కుంట సతీష్, బీఆర్ఎస్ నాయకులు.. మోహన్‌రావు, ఆంజనేయులు, పరమేశ్వరి, దీపమల్లేశ్, రాజునాయక్, రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, నవంబర్ 26: నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు మాగంటి సునీతా గోపీనాథ్ పిపుపునిచ్చారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాగంటి సునీతా గోపీనాథ్ మాట్లాడుతూ.. దీక్షా దివస్ రోజున నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజలు చేయాలని, ఉద్యమసారథి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఉద్యమకారులను దీక్షాదివస్‌లో భాగస్వాములు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.