సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నడిరోడ్లపై హత్యలు, దోపిడీ దొంగతనాలతో అట్టుడికిపోతున్న నగరంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టి, దోపిడీ దొంగల ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నగరంలోని పలు చోట్ల డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా చిలకలగూడలో దుండగులు పోలీసులపైకి దాడులకు యత్నించడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇదిలా ఉండగా పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్, కుల్సుంపురా డివిజన్లలో రెండు మూడు రోజులుగా జరుగుతున్న హత్యలు, ఇతర నేరాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. అదే సమయంలో ఆసిఫ్‌నగర్‌లో రోడ్లపై కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున గుమ్మిగూడటంతో నెలకొన్న అలజడితో స్వయంగా రంగంలోకి దిగిన సీపీ గాల్లోకి కాల్పులు జరిపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు, సీపీని వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా వారు స్పందించలేదు.
చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో సెల్‌ఫోన్ స్నాచింగ్, ఇతర దోపిడీ దొంగల ముఠాలను పట్టుకునేందుకు యాంటీ డెకాయి బృందాలు శుక్రవారం అర్ధరాత్రి డెకాయి ఆపరేషన్ నిర్వహించాయి. మఫ్టీలో ఉన్న పోలీసుల వద్ద నుంచి దుండగులు సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు యత్నించడంతో సదరు నిందితుడిని పట్టుకున్నారు. మిగిలిన దుండగులు ముకుమ్మడిగా పోలీసులపై దాడులకు యత్నించడంతో గాల్లోకి కాల్పలు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా నగరంలో విరుచుకుపడుతున్న థార్, భవర్య గ్యాంగ్‌లను పట్టుకోవడమే లక్ష్యంగా పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
నేరాలను నియంత్రించేందుకు నగరంలో డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఎనిమిది గ్యాంగ్‌లను అరెస్టు చేశాం. ఈ క్రమంలోనే చిలకలగూడ పరిధిలోని మెట్టుగూడలో డెకాయి ఆపరేషన్ నిర్వహించాం. అక్కడ కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ల స్నాచింగ్, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ డెకాయి ఆపరేషన్ జరిపి నలుగురు ముఠా సభ్యులను పట్టుకుని విచారిస్తున్నాం. మెట్టుగూడలో డెకాయి ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో దుండగులు పోలీసులపై దాడికి యత్నించారు. వారిని నియంత్రించడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.