మణికొండ, జనవరి 25 : అత్తామామలు సంపాదించిన ఆస్తులు తీసుకొని ఓ కోడలు.. బతికి ఉన్న అత్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించి.. ఆమెను అనాథాశ్రమానికి పంపించింది. అయితే.. తమ కోడలు వేధిస్తుందంటూ బాధిత వృద్ధురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే వారు పట్టించుకోకపోవడంతో నెలరోజులపాటు ఠాణా చుట్టూ తిరుగుతూనే ఉన్నది. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ మున్సిపాలిటీ, అల్కాపూర్ టౌన్షిప్లో చాయాదేవి(70)..భర్త రామకృష్ణ, కుమారుడు శివప్రసాద్, కోడలు మాధవి, మనవడు ప్రణవ్‌లతో కలిసి నివాసముండేది. రెండేళ్ల కిందట భర్త, కొడుకు అనారోగ్య కారణాలతో మృతిచెందారు. మనవడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. కోడలు మాధవితో కలిసి చాయాదేవి ఫ్లాట్‌లో ఉంటున్నారు.
కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. కాగా.. కోడలు మాధవి కొన్నిరోజుల కిందట మరోవ్యక్తిని వివాహం చేసుకుని అదే ఇంట్లో కాపురం పెట్టింది. అప్పటి నుంచి అత్తను బయటకు పంపాలని వేధింపులకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో అత్తను ఆమె ఇద్దరు కూతుళ్ల వద్ద ఉండాలని పంపించి.. ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించింది.
కొన్నాళ్లు తన ఇద్దరు కూతుళ్ల వద్ద ఉండి.. మనస్సు నచ్చక వృద్ధాశ్రమంలో ఉంటున్నట్లు బాధితురాలు చాయాదేవి వాపోతున్నది. తన భర్త సంపాదించిన ఫ్లాటును కోడలు ఆక్రమించుకుని.. దానిపై రూ.40 లక్షల బ్యాంకు రుణాన్ని సైతం తీసుకుని.. తనను బయటకు పంపించిందని.. న్యాయం చేయాలని నెల రోజుల కిందట నార్సింగి పోలీసులను ఆశ్రమియిస్తే..విచారణ పేరిట పట్టించుకోవడంలేదంటూ.. శనివారం ఏసీపీ ఏసీపీ రమణాగౌడ్ను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నది. కూతురు కొడుకులతో ఇంటికి వెళ్తే కోడలు అక్రమ కేసులు బనాయించి భయాందోళనలకు గురిచేస్తుందని వాపోయింది.
చాయాదేవికి జరిగిన అన్యాయంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని నార్సింగి పోలీసులను ఆదేశించినట్లు ఏసీపీ రమణాగౌడ్ తెలిపారు. బతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరించి.. ఆపై తనపైనే దాడిచేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే చట్టపరమైన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. వృద్ధురాలి ఆవేదనపై వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించానని తెలిపారు.