సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కొంత మంది ప్రొఫెసర్లు, కొన్ని విభాగాల డీన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను పర్సనల్‌గా తీసుకుంటు న్నారు.
ఎన్నికల్లో తమకు అనుకూలమైన సంఘాలను ప్రమోట్ చేస్తున్నారు. యూనివర్సిటీ, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న సంఘాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పలు సంఘాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో తటస్థంగా ఉంటూ అన్ని సంఘాలను సమానంగా చూడాల్సిన ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లు రాజకీయాలకు తెరలేపారని విమర్శిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలను ప్రోత్సహించేలా కొంత మంది ప్రొఫెసర్లు, డీన్లు వ్యవహిస్తున్నారని మిగతా విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో కొత్తగా చేరిన విద్యార్థులను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా దిశానిర్దేశం చేయవలసినవారు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అన్ని సంఘాలకు సమన్యాయం చేయాల్సిన కొంతమందికి సపోర్టు చేయడం సరికాదని అంటున్నారు.
స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన జూనియర్ విద్యార్థులపై కొంత మంది డీన్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేయాలని లేదా..? అంటూ బ్లాక్ మెయిల్‌కు దిగినట్లు తెలుస్తున్నది. ఎన్నికల్లో పోటీ చేసి ఏం సాధిద్దామనుకుంటున్నారు.? చదువుకోవాలని ఉందా లే దా? అంటూ బెదిరించడంతో కొంతమంది విద్యార్థులు భయపడి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
తమకు అనుకూలమైన సంఘాల నుంచి పోటీ చేసినవారిని మాత్రం ప్రోత్సహిస్తున్నారంటూ ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. డీన్ స్థానంలో ఉండి బెదిరింపు రాజకీయాలకు దిగడం సరైనది కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించాల్సిన గురువులు రాజకీయాలు చేయడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పోటీలో ఉన్న సంఘాల నేతలు తరగతి గదలకు వెళ్లి తమ మేనిఫెస్టోను వివరించేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తుంది. హెచ్‌సీయూలో కూడా ఎలక్షన్ కమిషన్ తరగతి గదిలోకి వెళ్లేందుకు కొంత సమయం ఇచ్చింది. కాని కొంత మంది ప్రొఫెసర్లు కొన్ని సంఘాలకే అనుమతిస్తున్నారంటూ విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ప్రొఫెసర్లు ఏబీవీపీ కూటమిని మాత్రమే తరగతి గదుల్లోకి అనుమతిస్తున్నట్లు ఆయా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారం చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అన్నివిధాల సహకరిస్తున్నా కొంత మంది ప్రొఫెసర్లు, డీన్లు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. ఏబీవీపీని గెలిపించడమే ధ్వేయంగా కొంత మంది ప్రొఫెసర్లు పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు. యూనియన్ను రద్దు చేయడం నుంచి నామినేషన్లు, ప్రచారంలో వీరి పాత్ర కీలకంగా ఉందని ఆరోపిస్తున్నారు. సొం త ఎజెండాను పక్కన పెట్టి అన్ని విద్యార్థి సంఘాలను ఒకేవిధంగా చూడాలని కోరుతున్నారు. కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.