కొండాపూర్, జూలై 26: ఆఖరి మజిలీ ఆగమాగం అయ్యింది. బతికున్నప్పుడు ఎవరికైనా సమస్యలు ఉండటం కామన్. కానీ చనిపోయిన తర్వాత కూడా శ్మశానవాటికలో శవాన్ని పూడ్చే సమయంలో ఇబ్బందులు తప్పటం లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అంజయ్యనగర్కు చెందిన ఓ వ్యక్తిని శ్మశానవాటికలోని బొందలో ఖననం చేస్తున్న తరుణంలో ఒకసారిగా నీరు ఉబికి వచ్చింది. దీంతో మృతదేహం నీళ్లపై తేలియాడటంతో అంతా ఆందోళన చెందారు.
నీరుపోయే దారి లేకపోవడంతో చేసేది లేక శ్మశానవాటికకు బండరాయి కట్టి పూడ్చిపెట్టారు. దీనికి తోడు వరుస వర్షాలతో శ్మశానవాటిక లోపలికి వెళ్లేదారి పూర్తిగా బురదమయం కావడంతో పాడెమోసే పరిస్థితి కరువైంది. చెప్పులు చేతిలో పట్టుకుని మరీ పాడె మోయాల్సి వచ్చింది. చుట్టుపక్కల కాలనీలు ఎత్తులో ఉండటం, శ్మశానం లోతట్టుగా ఉండటం వలన వరద నీరు, డ్రైనేజీ మురుగు శ్మశానంలోకి వచ్చి చేరుతుందని.. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వసతులు కల్పించాలి..
అంజయ్య నగర్ శ్మశానవాటిక.. చుట్టుపకల కాలనీల కంటే లోతట్టుగా ఉండటంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొంద కోసం తీసిన గుంతలో నీళ్లు ఉబికి వస్తుండటంతో ఖననం చేయడం కష్టంగా మారుతుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని విద్యుత్ దహన యంత్రం, దహన ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు శ్మశానవాటికలో అన్నివసతులు కల్పించి ఆఖరి మజిలీకి ప్రశాంతతనుచేకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.
కాలనీని దత్తత తీసుకున్నా అభివృద్ధి శూన్యం..
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ అంజయ్యనగర్ కాలనీని ఓ ఎమ్మెల్యే దత్తత తీసుకున్నప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. స్థానిక శ్మశానవాటికను పట్టించుకునేవారు లేకపోవడంతో పిచ్చి మొకలు మొలవడం, బురదమయంతో అకడ అడుగుపెట్టాలంటేనే వణుకు పుట్టేలా ఉంది పరిస్థితి. స్థానిక సమస్యలు పరిష్కరించడంతో పాటు శ్మశాన వాటికలో అన్ని వసతులు కల్పించి ఆఖరి మజిలీకి ప్రశాంతతను చేకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.