De-Addiction Centers | సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రద్ధా వ్యవస విముక్తి(డీ-అడిక్షన్) కేంద్రంలో నల్గొండకు చెందిన పాండు నాయక్(30) చికిత్స పొందుతూ రెండు రోజుల కిందట మరణించాడు. అనుమానంతో తనిఖీలు నిర్వహించిన వైద్యారోగ్యశాఖ అధికారులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. నిర్వాహకుడు గతంలో తాను కూడా వ్యసనాల భారీన పడి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స తీసుకున్నాడు.
అనంతరం అతనే అనుమతి లేకుండా అర్హత లేకున్నా డీ- అడిక్షన్ సెంటర్‌ను నిర్వహిస్తూ బాధితుల నుంచి అందిన కాడికి సొమ్మును కాజేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇతనొక్కడే కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి, ముషీరాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మియాపూర్, దిల్‌షుఖ్‌నగర్, అమీర్‌పేట బంజారాహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రముఖమైన ప్రాంతాల పాటు జీహెచ్ఎంసీ చుట్టూ చాపకింద నీరుల ప్రైవేట్ డీ- అడిక్షన్ సెంటర్లు విస్తరించాయి.
నిత్యం ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిడి, చెడు స్నేహం, ఆర్థిక ఇబ్బందులు ఇలా మొదలైన సమస్యలతో సతమతమవుతూ చాలా మంది మత్తుకు బానిసలవుతున్నారు. కుటుంబాలను నాశనం చేసే మత్తు నుంచి బయటపడేందుకు బాధిత కుటుంబాలు డీ – అడిక్షన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ డీ- అడిక్షన్ సెంటర్ల నిర్వాహకులు వారి నుంచి రూ. 30,000 నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు.
గ్రేటర్లో ప్రస్తుతమున్న ప్రైవేట్ డీ-అడిక్షన్ సెంటర్లు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఎంహెచ్సీఏ-2017 నిబంధనలను తుంగలో తొక్కుతూ అర్హతలేని వైద్యమందిస్తూ బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వస్తవానికి ఎంహెచ్సీఏ-2017లోని 65వ సెక్షన్ ప్రకారం ఈ కేంద్రాలు కచ్చితంగా రాష్ట్ర మానసిక ఆరోగ్య ప్రాధికార సంస్థ(ఎస్‌ఎంహెచ్‌ఏ) వద్ద నమోదు చేసుకోవాలి. నిబంధనల మేరకు వైద్యులు, కౌన్సిలర్లు, సదుపాయాలు సెంటర్లో ఏర్పాటుచేసుకోవాలి. ఇదే యాక్ట్‌లోని 21వ సెక్షన్ ప్రకారం రోగులకు నాణ్యమైన చికిత్సనందించాలి. ఎంహెచ్సీఏ-2017లోని 107 సెక్షన్ ప్రకారం అనుమతి లేకుండా సెంటర్ నడిపితే జరిమానాతో పాటు కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.