హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీపీ నందీశ్వర బాబ్జీ మృతిచెందారు. రాచకొండ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న బాబ్జీ.. శనివారం ఉదయం లక్ష్మారెడ్డిపాలెంలో వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఏపీఎస్ఆర్టీకి చెందిన బస్సు ఆయనను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
లక్ష్మారెడ్డిపాలెంలోని మైత్రి కుటీర్‌లో బాబ్జీ నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు అదనపు డీసీపీగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో అడిషనల్ ఎస్పీగా విధులుగా నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాల్సి ఉన్నది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.