సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): నగరంలో జరుగుతున్న నకిలీ ఔషధాల విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు నగరంలోని పలుచోట్ల దాడులు జరిపింది. ఈ దాడుల్లో నగరంలోని కవాడిగూడలోని అర్వింద్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి పెద్ద మొత్తంలో నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సదరు డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన సమాచారం మేరకు కరీంనగర్‌లోని వేణు మెడికల్ ఏజెన్సీపై సైతం దాడులు నిర్వహించగా.. పెద్దఎత్తున నకిలీ ఔషధాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే… నగరంలోని కవాడిగూడలో ఉన్న అరవింద్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌లో నకిలీ ‘లెవిపిల్-500’ మాత్రలను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నకిలీ ఔషధ తయారీదారులు తాము తయారు చేసిన నాసిరకం ఔషధాలపై ప్రముఖ ఫార్మా సంస్థ తయారు చేస్తున్నట్లు తప్పుడు సమాచారాన్ని ముద్రిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ఈనెల 4న ముషీరాబాద్, కవాడిగూడలోని అరవింద్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్పై దాడులు జరపగా.. పెద్దఎత్తున నకిలీ ‘లెవిపిల్-500’మాత్రలు బయటపడ్డాయి.
మూర్చరోగానికి వినియోగించే ఈ మాత్రలను నాసిరకంగా తయారు చేసి విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి కొన్ని ఫార్మా కంపెనీలు. అంతే కాకుండా వాటిపై సన్‌ఫార్మా తయారు చేసినట్లు తప్పుడు సమాచారాన్ని ముద్రించి ఉన్నది. దీంతో అరవింద్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి పెద్ద మొత్తంలో నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన సమాచారం మేరకు కరీంనగర్‌లోని వేణు మెడికల్ ఏజెన్సీపై కూడా దాడులు జరిపి పెద్ద మొత్తంలో నకిలీ ‘లెవిపిల్-500’ మాత్రలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ షానవాజ్‌ఖాసిం ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో పలువురు డీసీఏ అధికారులు పాల్గొన్నారు.