సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా యథేచ్ఛగా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్ షాప్‌పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.1.15 లక్షల విలువజేసే 19 రకాల ఔషధాలను సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌లోని పీ అండ్ టీ కాలనీకి చెందిన నీరకంటి నగేశ్ స్థానికంగా ఉన్న మహాలక్ష్మీ గణపతి కాంప్లెక్స్‌లో డీసీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు మెడికల్ షాప్‌పై దాడులు జరిపి, రూ.1.15లక్షల విలువజేసే 19రకాల ఔషధాలను సీజ్ చేశారు. ఈ దాడుల్లో సరూర్‌నగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జె.నాగరాజు, హయత్‌నగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజు పాల్గొన్నారు.
అర్హత లేకుండానే యథేచ్ఛగా మెడికల్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మందులు సైతం విక్రయిస్తున్న ఒక నకిలీ క్లినిక్‌పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 1.85 లక్షల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన రతన్ బిస్వాస్ పుప్పాలగూడలోని లంబాడిగూడలో ‘బాలాజీ క్లినిక్’ పేరుతో ఓ క్లినిక్‌ను స్థాపించి, సరైన విద్యార్హత లేకపోయినా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతేకాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా, డీసీఏ అనుమతి లేకుండానే ఔషధాలను సైతం విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు నకిలీ క్లినిక్‌ను సీజ్ చేయడంతో పాటు అందులో విక్రయిస్తున్న రూ.1.85 లక్షల విలువజేసే 34 రకాల ఔషధాలను సీజ్ చేశారు.
ఖైరతాబాద్: నిషేధిత ఇంజిక్షన్లను విక్రయిస్తూ.. అవసరమైన వారికి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను టీన్యాబ్, పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్ విజయ్ కుమార్ గుప్తా (25) నేతృత్వంలో యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌కు చెందిన మహ్మద్ నయీముద్దీన్ (39) ద్వారా నిషేధిత పెంటాజోసిన్ ఇంజిక్షన్లు (మత్తు ఇంజిక్షన్లు) విక్రయిస్తూ, అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు.
నగరంలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్ కందిగూడకు చెందిన నామ్‌దేవ్ మహేశ్ అలియాస్ సిద్దూ (32), బీఎల్ఆర్నగర్కు చెందిన శైలీంద్ర లవన్ కుమార్ యాదవ్ (27), న్యూమిర్జాల్గూడకు చెందిన సురేశ్ సాయి కిరణ్ (28), బాలసరస్వతీనగర్కు చెందిన ముదిగొండ మనీశ్ యాదవ్ (30), ఓల్డ్ మల్కాజిగిరికి చెందిన జెల్లల నిఖిల్ యాదవ్ (30) ఇంజిక్షన్లను సదరు పెడ్లర్ల నుంచి కొనుగోలు చేశారు. పక్కా సమాచారంతో టీన్యాబ్, పంజాగుట్ట పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో సరఫరాదారు మహ్మద్ నయీముద్దీన్‌తో పాటు కొనుగోలు దారులను అరెస్టు చేశారు.
బీహార్‌కు చెందిన విజయ్‌కుమార్ ఇంటర్మీడియేట్ పూర్తయిన తర్వాత కుటుంబ పోషణ కోసం కిరాణా వ్యాపారం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో ఆర్జీజీఎస్ మెడికల్ షాపులో పనికి చేరాడు. అక్కడ చాలా మంది వినియోగదారులు పెంటాజోసిన్ ఇంజిక్షన్ కోసం బారులు తీరేవారు. అవసరమైతే ఆ ఇంజిక్షన్ కోసం ఎంత ఖర్చయినా పెట్టే వారు.
దీంతో ఈ మత్తు వ్యాపారం లాభసాటిగా ఉంటుందని భావించి.. సొంతంగా పాట్నాలోని బూత్‌నాథ్ రోడ్లో సరస్వతి ఎంటర్ప్రైజెస్ పేరుతో దుకాణం తెరిచాడు. స్వయంగా ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్‌గా అవతారమెత్తాడు. హాజీపూర్‌లోని మా సుశీల దేవి హాస్పిటల్లో కెమిస్ట్‌గా పనిచేసే విజయ్ కుమార్‌తో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఏకంగా ఈ మత్తు ఇంజిక్షన్లను ఇండియా మార్ట్ ద్వారా అవసరమైన వినియోగదారులకు సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఇలా తన మత్తు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వివిధ రాష్ర్టాల్లో కస్టమర్లకు పెంటాజోసిన్ ఇంజిక్షన్లు సరఫరా చేశాడు.