Antibiotics | సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ):ప్రజల ప్రాణాలకు హానికలిగించే నకిలీ మందులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝళిపిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నకిలీ ఔషధాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన డీసీఏ అధికారులు.. శుక్రవారం నకిలీ యాంటీబయోటిక్, నార్కోటిక్ మందులను పట్టుకుని సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం… యూపీకి చెందిన మహేశ్ కుమార్ షైనీ తన కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా సుద్ద, బియ్యం పిండితో నకిలీ యాంటీబయోటిక్ మందులను తయారు చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన గండ్ల రాములు, మునిశేఖర్ మహేశ్‌కుమార్ వద్ద నుంచి నకిలీ యాంటీబయోటిక్ మందులతో పాటు సర్జరీల్లో వినియోగించే ఫెంటనైల్ ట్రాన్స్‌డెర్మల్ ప్యాచెస్‌ను కొనుగోలు చేసి తెలంగాణలోని కరీంనగర్, ఏపీలోని కర్నూలుకు సరఫరా చేస్తున్నారు.
నకిలీ యాంటీబయోటిక్ మందులు, నార్కోటిక్ డ్రగ్స్‌ను నిందితులు యూపీ నుంచి నగరానికి కొరియర్ ద్వారా తెప్పించుకుని ఆ తరువాత వాటిని తెలంగాణలోని కరీంనగర్, ఏపీలోని కర్నూలు ప్రాంతాల్లోని మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు శుక్రవారం బాలానగర్‌లోని తిరుపతి కొరియర్ సంస్థపై ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్, డీసీఏ అధికారులు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు.
ఈ దాడుల్లో రూ.6.91 లక్షల విలువ చేసే నకిలీ యాంటీబయోటిక్ మందులతో పాటు నార్కోటిక్ డ్రగ్స్‌ను సీజ్, నిందితులు గండ్ర రాములు, మునిశేఖర్‌ను అరెస్టు చేశారు. అయితే గండ్ర రాములు గతంలో కూడా నకిలీ ఔషధాలను సరఫరా చేసిన పాత నేరస్తుడని, అతడిపై మూడు కేసులు నమోదై ఉన్నట్లు డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో చాకచక్యంగా వ్యవహరించి నకిలీ యాంటీబయోటిక్ ఔషధాలు, నార్కోటిక్ డ్రగ్స్ పట్టుకున్న డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, సరూర్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మలక్‌పేట డ్రగ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, లక్ష్మణ్, గోవింద్‌సింగ్, అనిల్‌రెడ్డి, ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు, ఇతర సిబ్బందిని డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.