సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఈ ఔషధాలు వాడితే పలానా రోగాలు నయమవుతాయంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ముద్రించిన ఔషధాలను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఈ దాడుల్లో పలు రకాల ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఈ మందు.. ఈ వ్యాధిని నయం చేస్తుందంటూ.. కొంతమంది ఔషధాలపై ప్రకటనలు ముద్రిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టం- 1954 ప్రకారం ఔషధాలపై చికిత్స పేరుతో ప్రకటనలు జారీచేయడం నేరమన్నారు. ఈ విధంగా ప్రకటనలు చేస్తే ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉన్నదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫార్మా కంపెనీలు పలు రకాల ఔషధాలపై ప్రకటనలు జారీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు జూలై 30, 31తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ షాపులపై దాడులు జరిపారు.
ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా, జిల్లెలగూడ, సరూర్‌నగర్, సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం, సూర్యపేట, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న పలు మెడికల్ షాపులపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ‘పానియన్’ ఆయుర్వేదిక్ మాత్రలు, అశ్వగంధారిస్టా ఆయుర్వేధిక్ టానిక్, శ్రీశ్రీ తత్వ మహాత్రిఫలద్య గ్రితం, పల్లేరు కాయల పౌడర్, ప్రోస్విన్ యూనానీ మాత్రలను సీజ్ చేశారు. ఈ మేరకు సంబంధిత ఔషధ తయారీ కంపెనీలకు నోటీసులు జారీచేశారు.