సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో పోతూ సరికొత్త నేరాలతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. లాభాల ఆశ చూపుతూ సైబర్ మోసగాళ్లు భారీగా దండుకొంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొండం త కొల్లగొడుతుంటే పోలీసులు మాత్రం అతి కష్టం మీద గోరంత రికవరీ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాల వంటివి కామన్ నేరాలుగా మారిపోగా నిత్యావసరాలకు వాడే యాప్‌ల్లోనూ సైబర్ దొంగలు చొరబడడంతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నారు. టెక్నాలజీ పెరిగిన కారణంగా తాము వాడే యాప్‌ల సెక్యూరిటీ కచ్చితంగా అంచనా వేయాలని, ఆ దిశగా అవి సెక్యూర్డ్ యాప్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని వాడాలని సైబర్ పోలీసులు చెబుతున్నా.. నిత్యం ఉపయోగించి కొన్నికొన్ని యాప్స్‌లో సైబర్ నేరగాళ్లు అనూహ్యంగా చొరబడుతూ బ్యాంక్ ఖాతాల నుంచి, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు.
అయితే ఈ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది.. కానీ వాటిని ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ సాంకేతికత పరంగా పోలీసులు వెనకబడిపోతున్నారన్న వాదనలు లేకపోలేదు. ఇందుకు పోలీసుల దగ్గర ఉన్న సాంకేతిక సామర్థ్యం సైబర్ నేరగాళ్లను కట్టడి చేయలేకపోతున్నదంటూ ఓ సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
గత రెండేండ్లలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోగా, వాటిలో కేవలం పది శాతం మాత్రమే ఛేదించారు. అందులోనూ శిక్షలు పడ్డది కేవలం రెండు శాతం మాత్రమే. ఇక సైబర్‌నేరాల్లో కోల్పోయిన డబ్బులు వేల కోట్లు ఉంటే వాటిలో రికవరీ చేసింది కేవలం వందల కోట్ల రూపాయలు మాత్రమే రికవరీ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ ఉద్యోగులు మొదలుకొని బ్యాంక్ ఖాతాలు వాడుతున్న వారిలో సుమారు 50శాతం మంది ఏదో ఒకరకంగా సైబర్‌నేరానికి మిగతా గురైనవారే కనిపిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆర్టీఏ, కేవైసీ వంటి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలను ఏపీకే లింక్‌లు పంపి అందినకాడికి దండుకుంటున్నారు. సైబర్‌నేరాల్లో కోల్పోయిన సొమ్ములో పోలీసులు అతి కష్టం మీద తక్కువ మొత్తంలో రికవరీ చేస్తున్నారు. గత సంవత్సరం గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 20,240 కేసులు నమోదయ్యాయి. రూ.1,29,461కోట్ల సొత్తును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో పోలీసులు కేవలం 10 శాతం కేసులు మాత్రమే ఛేదించగలిగారు. సైబర్ క్రిమినల్స్ అరెస్టులు, శిక్షలు కూడా కేవలం 2 శాతం మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో సైబర్ క్రిమినల్‌పై దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు ఉంటున్నాయని పోలీసులు చెప్పారు. వీరికి శిక్షలు పడనంతకాలం నేరాలను అదుపు చేయడం, నేరస్తులపై ఉక్కుపాదం మోపడం అనేది సాధ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక పోలీసు బృందాలతో వివిధ రాష్ర్టాలు, నగరాలను జల్లెడపట్టి సైబర్నేరగాళ్లను పట్టుకొస్తున్నారు కానీ వారిలో మెజార్టీ నేరగాళ్లు రిమాండ్‌కు వెళ్లకుండానే నోటీసులు తీసుకుని వెళ్లిపోతున్నారని సైబర్ పోలీసులు చెప్పారు. సైబర్‌నేరాల్లో దాదాపుగా అన్నీ ఏడేండ్లలోపు శిక్షలుపడే కేసులే కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.