సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 31: హఠాత్తుగా.. అమ్మ చనిపోయింది. కాళ్లకింద భూమి కదిలింది. ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు నాన్న లేడు. ఏం చేయాలో అర్థం కాక ఆ భీతిలో కూతుళ్లు కూడా మానసిక ైస్థెర్యాన్ని కోల్పోయారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. విషయం బయటికి చెప్పే సాహసం చేయలేక అమ్మ పార్థివ దేహంతోనే రెండు మూడు రోజులు గడిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం లలిత(45) రెండు నెలల నుండి బౌద్ధనగర్‌లో తన ఇద్దరు కూతుళ్లతో కలసి నివసించేది. దాదాపు 5ఏళ్ల క్రితమే లలిత భర్త కుటుంబ కలహాలతో వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇద్దరు కూతుళ్లు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆరోగ్యంగానే ఉన్న లలిత ఇటీవల కొద్దిగా మానసిక స్థితి కోల్పోయినట్లు కనిపించేదని ఇంటి యజమాని తెలిపారు. కాగా, ఈ నెల 23న గురువారం లలిత మృతి చెందింది. కానీ ఈ విషయం బయటకు పొకకుండా కూతుర్లు శవంతోనే గడిపారు.
పూర్తిగా మానసిక సె్థైర్యాన్ని కోల్పోయి వారు కూడా ఆత్మహత్యకు యత్నించారు. చేతులపై కత్తితో కోసుకున్నట్లు ఆనవాలు చూపించారు. శుక్రవారం వారిద్దరూ వారాసిగూడ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం ను రప్పించి వివరాలు సేకరించారు. ఘటనా స్థలికి ఈస్ట్ జోన్ చిలకలగూడ ఏసీపీ జయపాల్ రెడ్డి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.