హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 17: తండ్రిని కాపాడబోయి టస్కర్ వాహనం టైర్ల కింద పడిన ఓ బాలిక తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన మహేందర్ తన కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా ఎల్బీనగర్లోని సరస్వతి కాలనీలో ఉంటున్నాడు.
అతడి కూతురు పూజిత (17) దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రగతి డిగ్రీ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. గణేశ్ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏడాది కాచిగూడకు వచ్చి.. వినాయకుడిని ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి కూడా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాన్ని ఈ నెల 15వ తేదీన రాత్రి ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు తరలించారు.
హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద టస్కర్ వాహనంపై ఉన్న మహేందర్ కిందికి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. ఈ ఘటనను అతడి కూతురు పూజిత గమనించి.. అతడిని కాపాడబోయే క్రమంలో టస్కర్ వాహనాన్ని డ్రైవర్ రమేశ్ ముందుకు కదిలించగా.. ఆమె ప్రమాదవశాత్తు వెనుక టైరు కింద పడి పోయింది. అక్కడే ఉన్న కొందరు గమనించి వెంటనే పక్కకు లాగారు.
అప్పటికే ఆమె పొత్తికడపులో బలంగా టస్కర్ టైరు తాకడంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పూజిత మృతదేహానికి ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన టస్కర్ డ్రైవర్ రమేశ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్సై వెంకటేశ్ తెలిపారు.