Hyderabad | గ్రేటర్లో ఏ రోడ్డు చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా గుంతలే..!! ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీగా ప్రయాణించేందుకు వీల్లేకుండా ఉన్నవి. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. గడిచిన కొన్ని రోజులు వర్షాలు లేకపోయినప్పటికీ పాడైన రహదారుల మరమ్మతుల్లో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నది.
25వేలకు పైగా పాట్‌హోల్స్ ఏర్పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేయగా, మరమ్మతు పనులను మాత్రం చేపట్టడం లేదు. ఈ క్రమంలో నిత్యం వందలాది మంది నుంచి జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వస్తున్నా.. అధికారులు స్పందించడం లేదు. దీంతో చాలా చోట్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ)
ఐఆర్సీ నిబంధనలకు తూట్లు..
జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఇందులో 70% రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. 709 కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు గుంతలతోనే దర్శనమిస్తున్నాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేళ్ల వరకు, సీసీ రోడ్డు అయితే 10 ఏండ్ల వరకు ఉండాలి. కానీ ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే పూర్తిగా గుంతలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతుండటంతోనే రోడ్లు త్వరగా డ్యామేజ్ అవుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు.
ఈ ప్రాంతాల్లో ప్రయాణం నరకం..
బంజారాహిల్స్‌లోని ఏసీబీ క్వార్టర్స్, జూబ్లీహిల్స్, నానల్‌నగర్, మెహిదీపట్నం, షేక్‌పేట, ప్యారడైజ్, రాంగోపాల్‌పేట, మూసారంబాగ్, బాలానగర్, ఎర్రగడ్డ, బహదూర్‌పురా, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. నారాయణగూడ నుంచి రామంతాపూర్‌కు వెళ్లే ప్రయాణికులు అరగంట పాటు నరకం చూపే రహదారిపై ప్రయాణం తప్పదు. అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తా నుంచి ముఖ్రం హోటల్ వరకు మోకాలులోతు గుంతలు ఏర్పడ్డాయి. పంజాగుట్ట సాయిబాబా కాలనీ, డీడీ కాలనీ, నల్లకుంట కూడలి, జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండగా.. వేరే రూట్ల నుంచి వెళుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వాహనాలు కాస్తా స్పీడ్‌గా వెళితే స్కిడ్ అయి వాహనదారులు కింద పడుతున్నారు. దీంతో వీలైనంత త్వరగా గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.