బంజారాహిల్స్,జనవరి 11: బంజారాహిల్స్ రోడ్ నం 10లోని గౌరీశంకర్ కాలనీలో కమ్యూనిటీహాల్‌ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం ప్రారంభించారు. చాలా కాలం క్రితమే ఈ కమ్యూనిటీహాల్ నిర్మాణం పూర్తయినప్పటికీ కొంతభాగం అసంపూర్తిగా ఉండడంతో స్థానికులు ఉపయోగించుకోలేకపోయారు. దీంతో ఈ పెండింగ్ పనులను పూర్తిచేయాలని స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఎమ్మెల్యేను కోరడంతో నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. బస్తీలు, కాలనీల్లో నివాసం ఉంటున్న వారి సౌకర్యం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కొత్త కమ్యూనిటీహాళ్ల నిర్మాణం చేయడంతో పాటు పాత వాటిలో సమస్యలను పరిష్కరించేందుకు మరమ్మతులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రూ.1.5కోట్లతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని గౌరీశంకర్ కాలనీలోని సరస్వతి స్కూల్ ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ స్థలంలో రూ.1.5కోట్లతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించనున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం గౌరీశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..జహీరానగర్‌లోని ప్రభుత్వ స్థలంలో మరో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయించాలని ప్రయత్నిస్తున్నామని, అయితే కొన్ని చిక్కులున్నాయని తేలడంతో మరో స్థలాన్ని చూస్తున్నామన్నారు. త్వరలో దళిత బంధు పథకం నియోజకవర్గంలో ప్రారంభమవుతుందని, నియోజకవర్గంలో డివిజన్‌కు 15నుంచి 20మంది లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్ కవితారెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రమేశ్‌యాదవ్, కార్యదర్శి వెంకటేశ్వర్, టీ.శేఖర్, మనోజ్‌కుమార్, రమేశ్, భిక్షపతి పాల్గొన్నారు.
ఘనంగా రైతుబంధు సంబురాలు
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ చేయూత అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా రైతుబంధు సంబురాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.11లో మంగళవారం రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. రూ.50వేల కోట్ల రైతుబంధు సాయం అందించిన సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన పతంగులను ఎమ్మెల్యే దానం పిల్లలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్‌కుమార్, ప్రేమ్‌కుమార్, శౌరీరాజు తదితరులు పాల్గొన్నారు.