దళితుల జీవితాల్లో వెలుగులు
లబ్ధిదారుడికి కారును అందజేసిన విప్ గాంధీ
మియాపూర్, జూలై 13 : దళితుల నిజమైన ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సామాజికంగా ఆర్థికంగా వారి జీవితాలలో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ ఎంఐజికి చెందిన నీరుడు చంద్రయ్యకు దళితబంధు పథకం కింద మంజూరైన కారును కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డితో కలిసి విప్ గాంధీ లబ్ధిదారుకు బుధవారం తన నివాసంలో అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోలేని ఈ పథకాన్ని తొలిసారిగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పథకం లబ్ధిదారులు తమ యూనిట్‌ను విజయవంతంగా నిర్వహించుకుని తోటి వారికి స్ఫూర్తిగా నిలవాలని గాంధీ పిలుపునిచ్చారు. ఈ పథకం డ్రైవర్ల నుంచి యజమానులుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మోహన్ గౌడ్, మాధవరం రంగారావు, శ్రీనివాస్‌యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, శ్రీను, సురేందర్, కునాల్ పాల్గొన్నారు.