సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): పేరున్న వెబ్సైట్ల పేర్లను పోలినట్లే నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తూ సైబర్‌నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అసలైన వెబ్సైట్ల లోగోలను వాడుతూ సోషల్‌మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తువులంటూ ఈ కామర్స్ వెబ్‌సైట్స్, ఎక్కువ లాభాలు సంపాదించవచ్చంటూ ట్రేడింగ్ సంబంధిత వెబ్సైట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
పెయిడ్ ప్రకటనలతో ఆయా నకిలీ వెబ్సైట్లకు ప్రమోషన్ కల్పిస్తూ అసలైన వాటిలో ప్రజలను నమ్మిస్తున్నారు. ఇలా ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ల పేర్లను సైతం సైబర్‌నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు బెస్ట్ డీల్స్ అంటూ అతి తక్కువ ధరకు బల్క్‌గా వస్తువులను అమ్మేస్తామంటూ ఆయా ప్రముఖ ఈ కామర్స్ సైట్ల పేర్లను ప్రయోగిస్తున్నారు. ప్లిప్‌కార్ట్, అమెజాన్, బిగ్‌బాస్కెట్ తదితర వెబ్సైట్లను పోలినట్లే నకిలీవి తయారు చేస్తూ తక్కువ ధరకు వస్తువులంటూ ప్రచారం చేస్తూ సైబర్‌నేరగాళ్లు మోసం చేస్తున్నారు. స్టాక్స్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లలోను ప్రముఖ వెబ్సైట్ల పేర్లను వాడుతున్నారు.
ఫిర్యాదు ఇవ్వరని…
ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లను పోలినట్లే ఉండే నకిలీ వెబ్సైట్ల తయారు చేసి వస్తువులు తక్కువ ధరకు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తారు. రూ. 300 లకు ఐదు కిలోల డ్రై ఫ్రూ ట్స్ అని ఒకరు, రూ. 400లకు టీవీ అంటూ మరొకరు ఇలా ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనను క్లిక్ చేసి ఆయా వెబ్సైట్లు ఇచ్చే ఆఫర్లు నిజమని నమ్మి డబ్బులు చెల్లించామంటే ఇంకా అంతే సంగతులు.
ఆ డబ్బులు పోయినట్లే. తక్కువ ధరకు వస్తువులు వస్తున్నాయనే ఆలోచనతో కొందరు రెండు మూడు వేల వరకు సరుకులు కొనేందుకు డబ్బులు వెచ్చిస్తుంటారు, మరికొందరు ఒక సారి ప్రయత్నిద్దాం, వస్తే వస్తాయి.. లేదంటే పోతాయనే ఉద్దేశంతో ఆయా వెబ్సైట్లను పరీక్షించేందుకు ఆన్లైన్లో పేమెంట్లు చేస్తున్నారు. ఇలా తక్కువ మొత్తంలో ఎక్కువ మంది పేమెంట్లు చేస్తుండడంతో నకిలీ వెబ్సైట్ల నిర్వాహకులు భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తుంటారు. అ యితే బాధితులు రెండు మూడు వేల లోపలే నష్ట పోతుండడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
ట్రేడింగ్ చేయడంతో…
ట్రేడింగ్‌లో వివిధ వెబ్సైట్లను ఇంటర్నెట్లో సైబర్‌నేరగాళ్లు అందుబాటులోకి తెస్తుంటారు. స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టాలనే ప్రయత్నిస్తున్న వాళ్లు ట్రేడింగ్ విషయంపై సెర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి బ్రౌజింగ్‌తో బాధితుల కంటికి ఈ నకిలీ వెబ్సైట్లు కన్పిస్తుంటాయి. అలా ఆయా వెబ్సైట్లను పరిశీలిస్తే వాటి ప్రొఫైల్ భారీగా ఉండడం, ఎప్పుడో ఆ వెబ్‌సైట్‌ను తయారు చేసినట్లు ఉండడంతో బాధితులు నిజమని నమ్మేస్తూ ఆయా వెబ్సైట్లలో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆ తరువాత మొదట కొంత డబ్బు వెచ్చించి ట్రేడింగ్ చేయడంతో కొంత లాభం పొందుతారు, అది నిజమని నమ్మి సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు.
తక్కువ ధర..ఎక్కవ లాభాలంటూ..
ఆన్లైన్లో తక్కువ ధరకు వస్తువులు, స్టాక్స్‌లో ఎక్కువ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ ముందుకొచ్చే వారి మాటలు నమ్మొద్దని సైబర్‌క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ధరకు ఆన్లైన్లో సరుకులు విక్రయిస్తున్నారంటే మోసముండే అవకాశముందని అనుమానించాల్సిందే. అసలైన వెబ్సైట్లను పోలినట్లు నకిలీ వెబ్సైట్లు వెలుస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలి. తక్కువ ధరకు వస్తువులు, డీల్స్ ప్రకటనలు చూశారంటే ఈ డీల్స్ ఆయా వెబ్సైట్లు ఇచ్చాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం ప్రముఖ వెబ్సైట్లలోకి వెళ్లి చూడాలి. డీల్స్ ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం వివిధ మార్గాలున్నాయి, వాటి ద్వారా ఆయా ప్రకటన గూర్చి ఆరా తీయవచ్చు. నకిలీ వెబ్సైట్లను గుర్తించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్లో తక్కువ ధరకు వస్తువులని, స్టాక్స్‌లలో ఎక్కువ లాభాలంటే నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.