సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ పోలీసు ఉన్నతాధికారికే సందేశాలు పంపించారు. ‘మీ వాహనం ఓవర్ స్పీడ్‌గా వెళ్తున్నదని కెమెరా గుర్తించిందం’టూ ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లికి సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పెట్టారు. మూడురోజుల్లో రెండుసార్లు ఇలాంటి సందేశాలే వచ్చాయని డీసీపీ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈనెల 10న తన వెహికల్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, స్పీడ్ కెమెరా మీ వెహికల్ స్పీడ్‌ను గుర్తించిందని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. చలాన్లు చూడాలంటే తాము పంపించిన లింక్ క్లిక్ చేయాలని కేటుగాళ్లు సూచించారు. చివర్లో ట్రాఫిక్ నియమాలు పాటించాలంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు.