Matrimony | సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): మ్యాట్రీమోనీ పేరుతో సైబర్‌నేరగాళ్ల మోసాలు తిరిగి పెరుగుతున్నాయి. ఈ తరహా మోసాలు కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉండి.. ఇటీవల ఎక్కువవుతున్నాయి. మ్యాట్రీమోనీ మోసాలపై గతంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో తగ్గుముఖం పడుతూ ఆగిపోయే స్థితికి వచ్చాయి. అయితే తిరిగి ఈ తరహా నేరాలు పెరగడం ప్రారంభమయ్యాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నామంటూ మ్యా ట్రీమోనీ సైట్ నుంచి పరిచయం కావడం, ఆ తరువాత కొన్నాళ్లు వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుకుంటూ, ఇండియా కు వస్తున్నాను..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పౌండ్స్, డాలర్లతో వస్తుంటే కస్టమ్స్ పట్టుకున్నారని ఒకరు.. నీ కోసం ఇక్కడ దాచిపెట్టిన సంపద అంతా అక్కడికి పంపించేస్తున్నానని, ఆ సంపద ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌కు పట్టుబడడంతో దా నికి డబ్బులు ఇవ్వాలంటూ అందినకాడికి దోచుకోవడం.. ఇలా రక రకాలుగా మాటలు చెబుతూ సైబర్‌నేరగాళ్లు లూ టీ చేస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి మోసాలు నైజీరియన్ సైబర్ ఛీటర్స్ చేస్తుంటారు. చాలా కేసుల్లో నిందితులు పట్టుబడడం, ప్రజల్లో అవగాహన పెరగడంతో కొన్నాళ్లు ఈ నేరగాళ్లు స్తబ్దుగా ఉన్నారు. అయితే ఇటీవల తిరిగి ఈ మోసాలు చేస్తూ దోచేస్తున్నారు. ఇటీవల రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి కేసులు రెండు నమోదయ్యా యి, ఆయా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఉద్యోగం చేసే 42 ఏండ్ల మహిళకు షాదీ. కామ్‌లో ఎన్ఆర్ఐ పేరుతో అరుణ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరు కొన్నాళ్లు మాట్లాడుకున్నారు. అరుణ్‌కుమార్ తనకు 8 ఏండ్ల కూతురుందని, తనతో కలిసి ఇండియాకు వస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారంటూ చెప్పాడు. తనవద్ద 56,000 పౌండ్లు ఉన్నాయని, ఇవి పరిమితికి మించి ఉన్నాయంటూ బ్లాక్ చేశారు, రూ. 5.46 లక్షలు ఐటీ చార్జీ లు కడితే వదిలేస్తామంటున్నారంటూ నమ్మించాడు. బాధితురాలు నమ్మి డబ్బు చెల్లించింది, ఇంకా డబ్బు కావాలం టూ అడగడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఉద్యోగం చేసే ఒక మహిళకు డైవర్స్ మ్యాట్రీమోనీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నుంచి రాకేశ్ శర్మ పేరుతో వాట్సాప్‌లో పేరు వచ్చింది. పెండ్లికి సంబంధించిన విషయం మాట్లాడారు. తాను అమెరికాలో న్యూ రో సర్జన్ అంటూ నమ్మించాడు. ఇద్దరు పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత తాను ఇండియా కు వస్తున్నానంటూ నమ్మించిన సైబర్‌క్రిమినల్… రూట్స్, ట్రావెలింగ్కు సంబంధించిన బుకింగ్స్‌కు కావాల్సిన ఖర్చులంటూ కొంత డబ్బు వసూలు చేశాడు.
ఆ తరువాత నేను ఇండియాకు రావడం లేదు కానీ, ఇక్కడ సంపాదించిన సొమ్ము అక్కడకు పంపిస్తున్నాను, అందులో డాలర్లు, బం గారు, వజ్రాభరణాలుంటాయంటూ నమ్మించాడు. మరుసటి రోజు అమెరికా నుంచి ఇండియాకు కోట్ల రూపాయల విలువైన వస్తువులు వచ్చి అక్కడ ఎయిర్‌పోర్టులో ఆగిపోయాయి, వాటికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించి క్లియర్ చేసుకోవాలంటూ రాకేశ్ శర్మ బాధితురాలికి చెప్పడంతో ఆమె ఆ క్లియరెన్స్ కోసం భారీగా డబ్బు పంపించింది. ఇలా సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 23.62 లక్షలు పోగొట్టుకుంది. ఇంకా డబ్బు కావాలని అడుగుతుండడంతో ఇదంతా మో సమని గుర్తించిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.