Hyderabad | సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చూసి ఓ ఫేక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మొదట్లో లాభాలు చూసి.. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోయాడు హైదరాబాద్ నగరవాసి. జూబ్లీహిల్స్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ ఎఫ్ఎక్స్ రోడ్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాడు. ప్రకటనపై క్లిక్ చేయగానే తాము సంస్థ ప్రతినిధులమంటూ కొందరు అతనిని సంప్రదించారు. సంస్థలో నమోదు చేసుకోవాలని, పెట్టుబడులు పెట్టడానికి కావలసిన పేపర్స్‌పై డిజిటల్ సంతకం చేయడానికి, క్రెడిట్‌కార్డు , బ్యాంక్ లావాదేవీల ద్వారా పెట్టుబడి పెట్టడానికి అతన్ని ఒప్పించారు.
ముడిచమురు, లోహాలు, టెస్లా వంటి కంపెనీ స్టాక్‌లు, క్రిప్టో కరెన్సీల వంటి వ్యాపారాల్లో అతని పెట్టుబడులు ఉపయోగిస్తున్నామని చెప్పి మొదట్లో లాభాలు చూపించారు. మార్కెట్ కొంచెం డౌన్‌గా ఉందని, మార్జిన్ స్థిరంగా ఉండాలంటే మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ చెప్పి బాధితుడి ద్వారా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ సేవింగ్స్ సురక్షపై అప్పుగా ఇలా పలు రకాలుగా మొత్తం రూ.57,43,414 లక్షలను పెట్టుబడి పెట్టించి.. ఆ తరువాత స్పందించలేదు. దీంతో ఆ కంపెనీ పత్రాలపై ఆరా తీయగా అవి నకిలీవని తేలడంతో బాధితుడు 1930 ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టే ముందు కంపెనీ స్టాండర్డ్స్ పూర్తిగా పరిశీలించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.