సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సోషల్‌మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు ఇస్తూ, సైబర్‌నేరగాళ్లు అమాయకులకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోనే ట్రేడింగ్ మోసాలు నేడు ట్రెండింగ్‌గా మారాయి. సోషల్‌మీడియానే కాదు.. సాధారణంగా ఉపయోగించే యాప్‌లు… ఇతర వెబ్సైట్లలోనూ ట్రేడింగ్ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ట్రేడింగ్‌లో ఏఐని కూడా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
నేడు వెబ్‌లో ప్రకటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రకటనలపై రూ.లక్ష పెట్టుబడి పెడితే, వాటిని నమ్మిన అమాయకుల నుంచి రూ.కోట్లు కొట్టేస్తూ సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయంటూ ఎక్కువగా ఈ ప్రకటనలు ఇస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్తోపాటు వివిధ రకాల సేవలు అందించే యాప్‌లు, వెబ్సైట్లలో ట్రేడింగ్‌కు సంబంధించిన రోజుకో కొత్త ప్రకటన దర్శనమిస్తోంది.
గూగుల్, ఫేస్బుక్ యాడ్ ప్రమోషన్లతోపాటు ఇతర ప్రముఖ సర్చు ఇంజన్లు, పేరున్న వెబ్సైట్లలో సైబర్‌నేరగాళ్లు వివిధ రకాలైన ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ప్రకటనలు ఆకర్షిణీయంగా ఉంటూ ఈజీగా అమాయకులను నమ్మించే విధంగా ఉంటున్నాయి. సోషల్‌మీడియాలో ప్రకటనలు, ఏఐని కూడా ఉపయోగిస్తూ ప్రముఖుల వీడియోలతో పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రకటనలు చూసి చదువుకున్న అమాయకులను సైబర్‌నేరగాళ్లు ఈజీగా బోల్తా కొట్టిస్తున్నారు.
ప్రతిరోజూ సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కుతూ రూ.కోట్లు పొగొట్టుకుంటున్న వారిలో చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలతోను ఆకర్షితులవుతూ మోసపోతున్నారు. సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదులలో రోజు సగం వరకు ట్రేడింగ్‌లో మోసపోయిన బాధితుల కేసులే ఉంటున్నాయి.
గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లే కొందరు ట్రేడింగ్ వ్యాపారాలను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇదంతా సైబర్‌నేరగాళ్లు పక్కా ఫ్లాన్‌తో చేస్తున్న మోసాలు. ట్రేడింగ్ అంటే ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్లు, ఇలాంటి ప్రకటనలు చూడడం, మార్ఫింగ్ వీడియోలు వినడంతో ప్రేరేపితమవుతూ సైబర్‌నేరగాళ్ల వలలో ఈజీగా చిక్కుతున్నారు. విదేశాలలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని సైబర్‌నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు.
మన అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడి
యాడ్ ప్రమోషన్లో ఏదీ నిజం, ఏదీ అబద్దం, ఏదీ మోసం అనే విషయాలను ఆయా సంస్థలు పట్టించుకోవు. ప్రకటనను పబ్లిష్ చేయడమే తమ పని అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రకటనలు ఇచ్చే ముందు సైతం సైబర్‌నేరగాళ్లు ముందస్తు ప్రణాళికలతో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక రూ.లక్షతో యాడ్ ప్రమోట్ చేశారంటే.. ఆయా వెబ్సైట్లు, యాప్‌ల విజిటర్స్‌ను బట్టి, ప్రకటన వీడియో సమయాన్ని బట్టి ప్రకటనల ధరలు ఉంటాయి.
ఒకో క్లిక్కు ఒక్కో రేటు ఉంటుంది. సాధారణంగా ఒక క్లిక్కు సాధారణ ప్రకటనకు రూ. 100 వరకైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటారు, అలాంటి రూ.లక్ష పెట్టుబడి పెడితే వెయ్యి మంది వరకు క్లిక్ చేసే అవకాశాలుంటాయి. అందులో కనీసం వంద మంది ఆ ప్రకటనలకు ఆకర్షితులై పది మంది ట్రేడింగ్‌కు ముందుకు వచ్చారంటే సైబర్‌నేరగాళ్ల పంట పండినట్లే. ఆ పది మందే లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు నమ్మి మోసపోతుంటారని, మోసంతో వచ్చిన సొమ్ముతో భారీగా ప్రకటనలు ఇస్తూ అమాయకులను సైబర్‌నేరగాళ్లు ఆకర్షిస్తున్నారంటూ నిపుణులు పేర్కొంటున్నారు.
ఒక సారి బాధితుడు ఆకర్షితుడై అందులో ఉన్న నెంబర్లను కాంటాక్టు చేశాడంటే ఆ తరువాత వాట్సాఫ్, టెలిగ్రామ్ గ్రూప్‌లో వారి నెంబర్లు చేర్చి అక్కడి నుంచి మోసం చేయడం ప్రారంభిస్తుంటారు. ట్రేడింగ్ మోసాలలో సైబర్‌నేరగాళ్లు చెప్పే మాటలే వారి పెట్టుబడి. మొదట్లో మాటలు చెప్పి అమాయకులను బుట్టలో వేశారంటే ఆ తరువాత బాధితుడే అందులో కూరుకుపోయి డబ్బులు పెట్టుబడి పెడుతూ మోసానికి గురవుతుంటాడు. ఇందుకు మొదట మాటలు, ఆ తరువాత వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లలో ట్రేడింగ్‌లో నిష్ణాతులైన వారితో చర్చలు, సూచనలంటూ మాయ మాటలు చెబుతుంటారు.
ఆయా గ్రూప్‌లలో ఉండేవారిలో సగం మంది సైబర్నేరగాళ్లే ఉంటారు. మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని మొదట్లో తక్కువ పెట్టుబడితో ట్రేడింగ్ మొదలు పెడుతారు. వెంటనే లాభాలొచ్చాయంటూ సైబర్‌నేరగాళ్లు తమ సొంతంగా బాధితులకు డబ్బులు ఇస్తారు. ఇలా డబ్బులు ఇచ్చిన తరువాత నుంచి నెమ్మదిగా మోసంలోకి దింపుతుంటారు. ప్రధానంగా సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్‌మీడియా గ్రూప్‌లలో ట్రేడింగ్ గూర్చి చర్చలు జరిపి అమాయకులను మోసం చేస్తుండంతో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.