సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్‌నేరగాళ్ల చేతిలో రూ.11లక్షలు కోల్పోయాడు. పంజాగుట్టకు చెందిన యువకుడికి రెడ్డి మ్యాట్రిమొని సైట్లో ఓ యువతి పరిచయమైంది. తాను స్కాట్లాండ్లో ఉంటున్నానని చెప్పి వాట్సాప్‌లో చాట్చేస్తూ పరిచయం పెంచుకుంది. క్రిప్టో ట్రేడింగ్ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని చెప్పి పెట్టుబడి పెట్టించింది. విత్ డ్రా ఆప్షన్ లేకపోవడంతో ఆ యువతిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ బహదూర్‌పురాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఓ మ్యాట్రిమొనీ సైట్లో వధువు కావాలంటూ పోస్ట్పెట్టాడు. దీనికి వెంటనే ఓ యువతి రిైప్లె ఇచ్చి తాను పాకిస్తాన్‌కు చెందిన నటిగా పరిచయం చేసుకుంది. కొన్నిరోజుల తర్వాత ఆమె సోదరినంటూ మరో యువతి బాధితుడిని సంప్రదించింది. ఈ ఇద్దరు యువతులు కలిసి తమ కుటుంబసభ్యులకు అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు అంటూ బురిడీ కొట్టించి అతని దగ్గర నుంచి రూ.22లక్షలు వసూలు చేశారు.
చివరకు ఓ రోజు ఆ యువతి ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. చిక్కడపల్లికి చెందిన 68ఏళ్ల విశ్రాంత ఉద్యోగి, భార్య చనిపోవడంతో తోడు కోసం మ్యాట్రిమొని సైట్‌ను ఆశ్రయించారు. తన వివరాలు నమోదు చేసుకుని అనుకూలమైన వారికోసం అన్వేషించారు. అతని ప్రొఫైల్ చూసిన ఓ మహిళ బాధితుడికి ఫోన్‌చేసి మాట్లాడి ఆ తర్వాత అతనితో చాటింగ్ చేసింది. పలురకాలుగా చెప్పి నమ్మించింది. కొన్నిరోజుల తర్వాత తనకు రకరకాల అవసరాలు ఉన్నాయని చెప్పి పలు దఫాలుగా రూ.7.75లక్షలు కొట్టేసింది. మరో లక్ష కావాలని అడగడంతో ఆయనకు అనుమానం వచ్చి లబోదిబోమన్నారు.
హైదరాబాద్ నగరంలో వరుసగా వెలుగుచూస్తున్న మ్యాట్రిమోనీ మోసాలలో కొన్ని సంఘటనలు మాత్రమే ఇవి. ఈ తరహా మోసాలకు సంబంధించి వారానికి రెండు, మూడు కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా పెళ్లి సంబంధం కోసం వివిధ సైట్లలో పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్న సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మంచి ఉద్యోగం చేస్తూ 30ఏళ్లు దాటినా పెళ్లికానివారు, రెండో పెళ్లి సంబంధం కోసం పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిని టార్గెట్ చేస్తున్నారు. ముగ్గురు నలుగురు ముఠాగా ఏర్పడి, యువతులతో మాట్లాడించి పెళ్లికి ఆసక్తి కనబరుస్తున్నామని చెప్పి వారిని ఆకర్షిస్తూ మోసం చేస్తున్నారు.
మోసాలకు కేరాఫ్..!
కొన్ని మ్యాట్రిమోనీ సైట్లు మోసాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాము చాలావరకు వాటిపై నిఘా పెట్టినా బాధితుల అవసరాలను బట్టి మోసాలకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. వివాహ సంబంధిత వెబ్సైట్లలో పేర్లు, తమ బయోడేటా నమోదుచేసిన తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టా వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొందరు సంప్రదిస్తున్నారు. వారు తమ ప్రొఫైల్ పంపించడంతో పాటు అందులో ఇంటర్నేషనల్ నెంబర్లు పెట్టి తాము విదేశాల్లో ఉన్నట్లు నమ్మించి వాట్సాప్ కాల్ ద్వారా ఆకర్షిస్తున్నారు.
మరికొందరు ఫేక్ ప్రొఫైల్ పెట్టి తమ అవసరాలు తీరినతర్వాత స్పందించడం మానేస్తున్నారు. మ్యాట్రిమొనీ సైట్ల నిర్వాహకులను కూడా తాము అలర్ట్ చేస్తున్నామని, అయితే వచ్చే ప్రొఫైల్స్‌ను ఎంత సెక్యూరిటీతో ఉంచినా సైబర్ నేరగాళ్లు ఆయా కంపెనీలలో కొందరితో కుమ్ముక్కై డేటా తీసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. తాము వివరాలు ఇచ్చిన తర్వాత వచ్చే ప్రొఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి సైట్ల నిర్వాహకులతో నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు పోవాలని, ఎవరైనా ముందుగా డబ్బులు అడిగితే వెంటనే తమను సంప్రదించాలని సైబర్ పోలీసులు చెప్పారు.