సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్ట్ కేసులో మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…82ఏళ్ళ వయస్సుగల ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఇంజినీర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌చేసి తాము ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పి, ‘ నీ పైన యాంటి మనీ లాండరింగ్ కేసు నమోదైంది, ఇదిగో ముంబై సైబర్‌క్రైమ్ ఆఫీసర్‌తో మాట్లాడండి…’ అంటూ మరో వ్యక్తితో వాట్సాప్ కాల్ మాట్లాడించారు.
ఈ క్రమంలో అవతలి వ్యక్తి మాట్లాడుతూ ‘మీ ఆధార్ కార్డు వివరాలతో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందంటూ బెదిరించాడు. ఈ క్రమంలో తీవ్ర వత్తిడికి గురైన బాధితుడు చేసేది లేక దుండగులు సూచించిన పలు బ్యాంకు ఖాతాలకు రూ1.38కోట్లు పంపించాడు. అనంతరం మోసాన్ని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన వారు తమిళనాడుకు చెందిన సచిన్, ముత్తుకుమార్, సలీమ్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా వ్యవహరిస్తూ బాధితులను భయబ్రాంతులకు గురిచేసి, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను బ్యాంకు ఖాతాల ద్వారా మార్పిడి చేయించుకుంటున్నట్లు గుర్తించారు.
అంతే కాకుండా నిందితులకు బ్యాంకు ఖాతాల వివరాలను అందిస్తున్న తమిళనాడుకు చెందిన సంకర్ గణేష్(46), అతడి అనుచరుడు ఎలన్ఛేజియన్ సత్యవేల్(45)ను గుర్తించిన పోలీసులు ఈనెల 18న వారిని తమిళనాడులో అరెస్టు చేసి, నగరానికి తీసుకువచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన జెస్మిన్ మండల్, సచిన్, ముత్తుకుమార్, సలీమ్‌ల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ లేదా వాట్సా ప్ కాల్ద్వారా కాల్ చేసి ఆధార్‌నెంబర్ లేదా ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఇవ్వవద్దని సైబరబాబాద్ సైబర్క్రైడ్ పోలీసులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు వివిధ రకాల దర్యాప్తు సంస్థల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి ఉచ్చులో పడకుండా జాగ్రతగా ఉండాలని, ఎవరైన ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫోన్ కట్‌చేసి, 100నెంబర్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.