Hyderabad | హైదరాబాద్ : ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీం తినేందుకు ఆసక్తి చూపుతారు. శుభకార్యాలకు కూడా భారీగా ఐస్క్రీంను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఐస్ క్రీంకు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. అయితే మార్కెట్లో విరివిగా విక్రయిస్తున్న కల్తీ ఐస్ క్రీంలపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దృష్టి సారించారు. ఈ కల్తీ ఐస్‌క్రీంలు తినడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో నిన్న చందానగర్‌లో రూ. 10 లక్షలు విలువ చేసే ఐస్క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కూకట్పల్లి, పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రాలను గుర్తించి, ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఐస్‌క్రీమ్స్‌లో ఉపయోగిస్తున్న నాణ్యత లేని రంగులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కల్తీ ఐస్క్రీంలకు బ్రాండెడ్ స్టిక్కర్లు జోడించి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో రూ. 28 లక్షల విలువచేసే కల్తీ ఐస్‌క్రీమ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అనూ ఫ్రోజెన్ ఫుడ్స్ పేరుతో నకిలీ ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్న గో డౌన్స్పై బాలానగర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతూ.. ఉత్పత్తులు తయారు చేస్తున్న రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఉన్న రూ. 15 లక్షల విలువైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌లో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ పేరుతో.. నకిలీ ప్రొడక్ట్స్ తయారీ గోదాంపై ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. గొల్ల అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 8 లక్షల 20 వేల విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.