khazana jewellery | హైదరాబాద్ : చందానగర్‌లో మంగళవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఖజానా జ్యువెలరీ దుకాణంలోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు.. కాల్పులు జరిపి భయానక వాతావరణం సృష్టించారు. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడున్న సీసీ కెమెరాలను తుపాకీ కాల్పులతో ధ్వంసం చేశారు. ఎదురుతిరిగిన జ్యువెలరీ దుకాణం డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరపడంతో.. ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఖజానా జ్యువెలరీ దుకాణంలోకి దుండగులు చొరబడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు. దుండగులందరూ ముఖానికి మాస్కులు ధరించి.. లోపలికి ప్రవేశించారు. అందరూ ఒకేసారి కాకుండా.. ఒకరి వెనుకాల ఒకరు జ్యువెలరీలోకి ప్రవేశించారు. దుకాణం నుంచి బయటకు వస్తున్న ఓ వ్యక్తిని దుండగులు అడ్డుకుని తుపాకీ ఎక్కుపెట్టి భయపెట్టించారు. ఒక దొంగ ప్రధాన ద్వారం వద్ద కాపలాగా ఉన్నాడు.
ఇక తుపాకీతో డిప్యూటీ మేనేజర్‌ను బెదిరించి లాకర్ కీ కావాలని దుండగులు అడిగారు. కీ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన కొందరు సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చే లోగా దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు దుండగులు జ్యువెలరీ దుకాణంలోకి చొరబడ్డారని తెలిపారు. దుండగుల కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్ గాయపడినట్లు పేర్కొన్నారు. బంగారు ఆభరణాలు ఉన్న కౌంటర్లను దుండగులు తెరవలేకపోయారని, వెండి ఆభరణాలు ఉన్న కౌంటర్లను ధ్వంసం చేసి వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. ఎంత వెండి చోరీ చేశారనేది దానిపై స్పష్టత లేదన్నారు.