శంషాబాద్ రూరల్, జూన్ 8: మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలతో గల్ఫ్‌దేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తుండగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు బాధిత మహిళలు ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆదివారం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన నిందితుడిని అరెస్టు చేశారు.
ఆర్జీఐఏ అవుట్‌పోస్టు సీఐ బాలరాజు వివరాల ప్రకారం…పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన లంకపల్లి మేరి నాలుగు నెలల క్రితం అదే జిల్లాకు చెందిన ఆకుమర్తి సత్యనారాయణ అనే ఏజెంట్‌ను సంప్రదించి తనకు మస్కట్‌లో ఉద్యోగం ఇప్పించాలని కోరింది. దీంతో సదరు ఏజెంట్ వర్క్‌వీసా, పీఓఈ సర్టిఫికేట్, మెడికల్ క్లియరెన్స్ ఇప్పిస్తానంటూ సదరు మహిళకు హామీ ఇచ్చాడు. పాస్‌పోర్టు గడువు ముగియడంతో కొత్తపాస్పోర్టు సైతం ఇప్పిస్తానని తెలిపాడు. కాగా ఈనెల 5న ఏజెంట్ సత్యనారాయణ, మేరితో పాటు కొండలమ్మ అనే మరో మహిళతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు.
మహిళలిద్దరికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ హోటల్లో వసతి కల్పించిన సత్యనారాయణ అదే రోజు రాత్రి పాస్‌పోర్టులు, విమాన టికెట్లు, మస్కట్ విజిట్ వీసాలు అందచేశాడు. అనంతరం వారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పంపించి, ఎయిర్‌పోర్టులో ఎవ్వరైన అడిగితే సందర్శన కోసం వెళ్తున్నట్లు చెప్పాలని సూచించాడు. కాని సదరు మహిళలు ఎయిర్‌పోర్టు ఇమిగ్రేషన్ కౌంటర్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏజెంట్ సూచించనట్లుగా కాకుండా ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు చెప్పారు.
అంతే కాకుండా ఉద్యోగం కోసం సత్యనారాయణ అనే ఏజెంట్‌కు రూ.1.50లక్షలు చెల్లించామని, మస్కట్‌లో తమను సుందరం అనే మరో ఏజెంట్ రిసివ్ చేసుకుంటారని తెలిపారు. కాని ఏజెంట్ ఇచ్చినవి విజిటింగ్ వీసాలని, వీటితో అక్కడ వెళ్లి ఉద్యోగాలు చేయడం కుదరదని ఇమ్మిగ్రేషన్ అధికారులు సదరు మహిళలకు వివరించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన మహిళలు ఎయిర్పోర్ట్ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏజెంట్ సత్యనారాయణ అరెస్టు
ఇదిలా ఉండగా మస్కట్‌లోని మరో ఏజెంట్ సుందరంను కలిసేందుకు శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సత్యనారాయణను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. సుందరం అనే వ్యక్తి మస్కట్‌లో రోల్డ్ గోల్డ్ అండ్ ఫ్యాన్సీ సెంటర్‌ను నిర్వహిస్తూ మానవ అక్రమ రవాణా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు సత్యనారాయణ పోలీసుల విచారణలో వెల్లడించాడు. సుందరానికి శాంపిల్ రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు పంపడం కోసం తాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు (పీవోఈ)సర్టిఫికెట్ లేకుండా మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్నానని తెలిపాడు. మస్కట్‌లో సుందరం అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడని తెలిపాడు. పోలీసులు సత్యనారాయణను రిమాండ్‌కు తరలించారు.