సైబర్ నేరాలు లేదా ఆన్లైన్ ద్వారా ఆర్థిక నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.inవెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని డీసీపీ నర్సింహ సూచించారు. ఇక సెల్ఫోన్లను పోగొట్టుకున్న వారు సీఈఐఆర్ పోర్టల్లో రిపోర్ట్ చేయాలని డీసీపీ నర్సింహ సూచించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ల రికవరీలో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. చోరీకి గురైన, మిస్సైన చరవాణిలను రికవరీ చేయడంలో క్రైమ్ విభాగం రికార్డు సృష్టిస్తున్నది. ఇందులో భాగంగానే గడిచిన 35 రోజుల్లో రూ.2.40కోట్ల విలువ చేసే 800 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ మేరకు బుధవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ కె.నర్సింహ వివరాలను వెల్లడించారు.
సీసీఎస్, ఐటీసెల్, స్థానిక పోలీసులతో కలిసి 35 రోజుల్లో మాదాపూర్ సీసీఎస్ బృందం 135, బాలానగర్ సీసీఎస్ బృందం 140, మేడ్చల్ సీసీఎస్ బృందం 101, రాజేంద్రనగర్ సీసీఎస్ బృందం 133, శంషాబాద్ సీసీఎస్ బృందం 72, మేడ్చల్ జోన్ పోలీసులు 105, ఐటీ సెల్ బృందం 101 చొప్పున మొత్తం రూ. 2.40కోట్ల విలువైన 800 సెల్ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అందించామన్నారు. రికవరీ చేసిన ఫోన్లలో 60 శాతం వరకు ఇతర రాష్ర్టాల నుంచే ఉన్నట్లు చెప్పారు.
ఫోన్ పోయిన వెంటనే బాధితులు స్థానిక పోలీసు స్టేషన్లో లేదా సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్లో బాధితులు నేరుగా కూడా రిపోర్ట్ చేయవచ్చని, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ ద్వారానే చోరీకి గురైన లేదా మిస్సైన సెల్ఫోన్లను ఎక్కడ, ఎవరి వద్ద ఉన్నాయో గుర్తించి.. రికవరీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, సైబరాబాద్ పోలీసుల సేవలు భేష్ అని సెల్ఫోన్ బాధితులు ఈ సందర్భంగా పోలీసులను పొగడ్తలతో ముంచెత్తారు.