సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): సుదూర ప్రాంతాల్లో తిష్టవేసి, ఆన్‌లైన్‌ద్వారా అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు. ఈ క్రమంలోనే గడిచిన నెలరోజుల్లో 45మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్ ఇన్చార్జి డీసీపీ సాయిశ్రీ కథనం ప్రకారం.. జూలై 1నుంచి 22వరకు 25సైబర్ క్రైమ్ కేసుల ను ఛేదించినట్లు తెలిపారు.
ఈ కేసులకు సంబంధించి మొత్తం 45మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు వివరించారు. నేరస్థులంతా పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందినవారే కావడం తో నగరం నుంచి ప్రత్యేక బృందాలను అక్కడకు పంపించి నేరగా ళ్లను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. ఈ కేసులకు సంబంధించి న్యాయస్థానం నుంచి 153 రిఫండ్ ఆర్డర్లో తీసుకు వచ్చి, రూ.99.14లక్షలను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు.