సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు వచ్చాయి.. ప్రజలు సొంతూళ్లకు వెళుతున్నారు.. ఈ సందర్భంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాత్రి, పగటి వేళలో గస్తీ పెంచి నిఘా పెంచామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రజలు ధైర్యంగా సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లాలని, మీ కోసం పోలీస్ సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉంటుందని అన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు అంశాలపై వీడియో కన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ఉండటంతో చాలా మంది తమ ఇండ్లకు తాళం వేసి, సొంత ఊర్లకు వెళుతారని, ఈ సమయంలోనే నేరాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దొంగతనాలు జరగకుండా రాత్రి వేళల్లో పటిష్ట నిఘాను చేపట్టామన్నారు. ముమ్మర గస్తీతో నివాస ప్రాంతాల్లో విజుబుల్ పోలీసింగ్ పెంచామన్నారు.
పాత నేరస్తులపై నిఘా..
పాత నేరస్తులు, ఇటీవల జైళ్ల నుంచి బయటకు వచ్చిన వారి కార్యకలాపాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అనుమానితులను పట్టుకోవడం కోసం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తూ నేర నియంత్రణకు చర్యలు చేపట్టామని సీపీ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది సరిహద్దు కమిషనరేట్ పోలీసులు, రైల్వే పోలీసులను సమన్వయం చేసుకుంటూ పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సంగన్వర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు, మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ డీసీపీలు శిల్పవల్లి, జగదీశ్వర్‌రెడ్డి, సందీప్ తదితరులు
పాల్గొన్నారు.
క్రైమ్ స్పాట్స్‌లో సీసీ కెమెరాలు..
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో పగలు, రాత్రి వేళలో ఆటోమొబైల్ దొంగతనాలు జరగకుండా క్రైమ్ స్పాట్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెడుతామని సీపీ పేర్కొన్నారు. పౌరులు తమ ప్రాంగణంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, 100కు కాల్చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదుపై సత్వరమే స్పందించాలని సిబ్బందికి సూచించారు.