సిటీబ్యూరో: హైదరాబాద్‌లో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా నేరాలు పెరిగాయి. హైదరాబాద్‌లో 41%, సైబరాబాద్‌లో 64%, రాచకొండలో 4 % నేరాలు పెరిగాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. నేరాలు పెరిగాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నేరాలు పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఆయా కమిషనరేట్ల పోలీసులు 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇందులో నేరాలు పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
గత బీఆర్ఎస్ హయాంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేసిన అప్పటి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో నేరాలను ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసింది. పటిష్టమైన శాంతి భద్రతలతో సురక్షితమైన నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకున్నది. అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చాక.. క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ పూర్తిగా గాలికొదిలేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులన్నీంటిపై కేసులు నమోదు చేయడంతోనే క్రైమ్ రేటు పెరిగిందనే వాదనను ఆయా పోలీస్ కమిషనర్లు వినిపిస్తున్నారు. సైబర్‌నేరాలు పెరుగుతున్నాయంటే అంగీకరించాల్సిందే. కానీ హత్యలు, లైంగిక దాడులు, దొంగతనాలు, ఆర్థిక నేరాలు అన్ని పెరగడం ప్రజలను తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నది.
మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. సాధారణ నేరాల్లో 64 శాతం పెరుగదల కనిపించగా, సైబర్‌నేరాల్లో 164 శాతం పెరిగాయి. డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీ వెల్లడించారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఈ సారి డ్రగ్స్‌ను అడ్డుకున్నామని తెలిపారు. ప్రధానంగా గంజాయి, కొకైన్, ఓపీఎం, సింథటిక్ డ్రగ్‌ను పట్టుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది 2714 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, వాటి విలువ రూ. 24.92 కోట్లు ఉంటుందని తెలిపారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టిస్తుండటంతో 135 కేసులు నమోదు చేసి రూ. 178 కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోయిన సెల్ఫోన్లకు సంబంధించి 69554 ఐఎంఈఐఎస్ బ్లాక్ చేసి 7967 సెల్ఫోన్లు బాధితులకు అందించినట్లు వివరించారు. నేరాల్లో శిక్షల శాతం గత ఏడాది 43.84 శాతం ఉండగా, ఈ ఏడాది 47.62 శాతం ఉందని సీపీ వివరించారు.
సైబరాబాద్‌లో వచ్చే ఏడాది నుంచి సైబర్ మోసాల్లో రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక నష్టం జరిగితే స్థానిక పోలీస్స్టేషన్లలోనే కేసులు నమోదు చేస్తామని సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 50 వేలపై ఆర్థిక నష్టం జరిగితే సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే వారని, సైబర్ క్రైమ్ ఠాణాపై భారం పడుతుండడంతో నష్ట పరిధిని పెంచుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయని, చాలా చోట్ల రోడ్లు విస్తరణ చేయడంతో ప్రమాదాల్లో మరణాలు తగ్గాయని వివరించారు.
మైలార్‌దేవ్‌పల్లి: ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసి ప్లాస్టిక్ గోనె సంచిలో తీసుకొచ్చి… నిర్మానుష ప్రాంతంలో పడేశారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గానగర్ చౌరస్తా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వెళ్లే మార్గంలో పారిశుధ్య సిబ్బంది రోడ్డు ఊడ్చుతుండగా ఓ వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు 30-35 సంవత్సరాల వ్యక్తిని ఎక్కడో హత్య చేసి ప్లాస్టిక్ గోనె సంచిలో పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.