Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తున్నాయంటూ ఒకరు.. క్రిప్టో కరెన్సీలో లాభాలంటూ మరొకరు.. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తే గంటకు వేలు సంపాదించవచ్చంటూ ఇలా.. లోన్ ఇప్పిస్తామని..పెండ్లి చేసుకుంటానంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా బాధితులు కనీసం మొదట ఇది నిజమా? అబద్ధమా? అనే విషయంపై కనీస చర్చ జరగడం లేదు.
కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు ఇలా కనీసం ఎవరితోనో ఒకరితో ఫలాన ఇలా ఆఫర్ ఉంది? ఎలా ఉంటుంది?అనే విషయంపై చర్చిస్తే కనీసం ఎవరో ఒకరు దానిపై అవగాహన ఉండి అదంతా ఛీటింగ్ అని చెప్పే అవకాశాలుంటాయి. కానీ సైబర్‌నేరగాళ్లు వేసే వలలో ఈజీగా చిక్కుకొని అత్యాశకు పోయి నిండా మునిగిపోతున్నారు. ఇది తమకొక్కరికే తెలుసు అనే భావనతో ఇతరులతో చర్చించకుండా ఊబీలో చిక్కుకుంటున్నారు.
మోసపోయిన తరువాత కూడా ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిలో ఉంటున్నారు. బయట తెలిస్తే ఎవరేమనుకుంటారో అనే ఆందోళనలో ఉంటున్నారు. ఇలా సైబర్‌క్రైమ్ బాధితులు ఘటనకు ముందు, తరువాత ఏ విషయం చెప్పుకోలేకపోవడం గమనార్హం. గుర్తుతెలియని వ్యక్తులు చెప్పేది ఎంత వరకు నిజం అనే విషయంపై కనీసం కుటుంబసభ్యులతోనైనా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. గుడ్డిగా ఇంటర్నెట్లో ఎవరో పంపించిన మెసేజ్‌లను నమ్మేసి లక్షలు, కోట్లు మోసపోతున్నారని పోలీసులు చెబుతున్నారు.
మాటలే మోసగాళ్ల పెట్టుబడి..
సైబర్ మోసాలలో సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలే వారి పెట్టుబడి. మొదట్లో మాటలు చెప్పి అమాయకులను బుట్టలో వేశారంటే ఆ తరువాత బాధితుడే అందులో కూరుకుపోయి డబ్బులు పెట్టుబడి పెడుతూ మోసానికి గురవుతుంటాడు. ఇందుకు మొదట మాటలు, ఆ తరువాత వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లలో పార్ట్‌టైమ్, క్రిప్టో, ట్రేడింగ్ అంటూ నిష్ణాతులైన వారితో చర్చలు, సూచనలంటూ మాయ మాటలు చెబుతుంటారు. డబ్బులు ఇచ్చిన తరువాత నుంచి నెమ్మదిగా మోసంలోకి దింపుతుంటారు. ప్రధానంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్‌మీడియా గ్రూప్‌లో ట్రేడింగ్ గూర్చి చర్చలు జరిపి అమాయకులను మోసం చేస్తుండటంతో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
అత్యాశతోనే ఎక్కువ మోసం..
ఎవరికి చెప్పకుండా మోసపోవడం, మోస పోయిన తరువాత కూడా ఎవరికి చెప్పుకోలేని వారిలో వంద శాతం అత్యాశకుపోవడంతోనే మోసపోతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పక్కింట్లో ఉండే వారికి చెబితే వాళ్లు కూడా మనను అనుసరించే అవకాశాలున్నాయని, నాకే డబ్బు కావాలనే భావనతో కొందరు ఉంటూ తమ ఖాతాలను తామే ఖాళీ చేసుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇంటర్నెట్లో డబ్బు ప్రస్తావన వచ్చిందంటే అది మోసమనే గుర్తించుకోవాలని, అత్యాశకుపోయి మునిగిపోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.