సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): మీ ఆధార్‌కార్డుతో సిమ్‌కార్డు తీసుకొని, దాని ద్వారా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు.. బెంగళూరు, ముంబైతో పాటు సీబీఐలో మీపై కేసు నమోదయ్యిందంటూ సైబర్‌నేరగాళ్లు ఓ రిటైర్డు టీచర్‌ను డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 10.2 లక్షలు కాజేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ కుంట్లూర్‌కు చెందిన బాధితుడికి గత నెల 23న గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. మేం బెంగళూర్ పోలీసులమని, మీ ఆధార్ కార్డు ఒక గుర్తుతెలియని ఫోన్ నంబర్‌కు లింక్ అయ్యిందని, దాని ద్వారా చట్టవిరుద్ధమైన ప్రకటనలు చేస్తుండడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పుకొన్నారు.
మీ ఆధార్ కార్డు, దాని ద్వారా తీసుకున్న సిమ్‌కార్డును దుర్వినియోగం చేస్తున్నారంటూ నమ్మించారు. తరువాత సీబీఐ డైరెక్టర్‌ను ముంబై నుంచి మాట్లాడుతున్నామంటూ మీ పేరుతో ఉన్న ఫోన్ నంబర్‌తో చట్టవిరుద్ధమైన ప్రకటనలు చేస్తూ, మేసెజ్‌లతో పలువురిని ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయంటూ భయపెట్టించారు. ఆ తరువాత ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ బెదిరించి, మీ కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వాలంటూ బెదిరిస్తూ, మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందంటూ బెంబేలెత్తిం చారు.
ఆ తరువాత మిమ్మల్ని వాట్సాప్ వీడియో కాల్లో విచారించాల్సి ఉందంటూ వీడియో కాల్ చేసి, మీ బ్యాంకు ఖాతాలు పరిశీలించి అసెస్మెంట్ చేయాలని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పడంతో ఆయా ఖాతాలు ఓపెన్ చేసి అందులో ఉన్న రూ. 10.2 లక్షల నగదును తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. అసెస్మెంట్ పూర్తి చేసిన తరువాత మీ ఖాతాలోకి తిరిగి ఆ డబ్బు బదిలీ చేస్తామంటూ నమ్మించారు. వీడియో కాల్ ముగిసిన తరువాత ఈ విషయంపై తన దగ్గరి వారితో బాధితుడు చర్చించడంతో అదంతా మోసమని, వాళ్లంతా నకిలీ పోలీసులంటూ చెప్పారు. దీంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.