గుర్తుతెలియని వ్యక్తులు ఆన్లైన్లో స్క్రీన్ టెస్ట్ చేసి వెంటనే ప్రముఖ వ్యాపార సంస్థలో మోడల్‌గా అవకాశమిస్తామంటే నమ్మవద్దని సైబర్ పోలీసులు చెప్పారు. ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ వంటి సోషల్‌మీడియా వేదికలుగా ప్రమోషనల్ ఈవెంట్ల కోసం పిల్లలకు అవకాశం ఇస్తామంటూ ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని వారు సూచించారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఆడిషన్స్ లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేయడానికి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారని, పిల్లల వీడియోలు, ఫొటోలు పంపమని అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్పారు. ఎటువంటి వ్యక్తిగత ఇంటర్వ్యూలు లేకుండా అవకాశం కల్పిస్తామని, డబ్బులు డిపాజిట్ చేయమని అడిగితే అది మోసమని గ్రహించి తమకు సమాచారమివ్వాలని సైబర్ పోలీసులు సూచించారు.
సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌కు చెందిన ఓ గృహిణి.. ఫేస్బుక్లో ప్రకటన చూసింది. అందులో నంబర్‌ను సంప్రదిస్తే హెచ్అండ్ఎం, అజియో, జరాకిడ్స్, మదర్‌కేర్ వంటి ప్రముఖ సంస్థల కోసం మోడలింగ్ హంట్ నిర్వహిస్తున్నామని ఓ మహిళ చెప్పింది. అక్కడ రాణిస్తే మీ పిల్లలకు సినిమాల్లో, టీవీల్లో అవకాశాలు దక్కుతాయంటూ నమ్మించింది. ఇందుకోసం పిల్లల ఫొటోలు పంపమని అడిగింది. దీనికి బాధితురాలు ఫొటోలు పంపుతూ ఆమె చెప్పినట్లుగా టెలిగ్రామ్‌లో ఒక యాప్ డౌన్లోడ్ చేసింది. మోడలింగ్‌కు అవసరమైన డ్రెస్సులు పంపి వాటిని ధరించి ఫొటోలు పంపమని చెప్పగా పంపింది. ఆ తర్వాత డిపాజిట్ల పేరుతో బాధితురాలి నుంచి రూ.3లక్షలు దోచుకుంది.
ఇలాంటి ఘటనలు వారానికి ఒకట్రెండు నగరంలో జరుగుతున్నాయని, కొన్ని ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు సైబర్‌క్రైమ్ పోలీస్స్టేషన్ల వరకు రావడంతో ఇటువంటి మోసాలు వెలుగు చూ స్తున్నాయని సైబర్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసా లు సర్వసాధారణమైపోయాయని పేర్కొన్నారు. అయితే లక్షల రూపాయలు కోల్పోయినవారు ఫిర్యాదుకు ముందుకు వస్తున్నప్పటికీ.. వేల రూపాయలు నష్టపోతున్నవారు గప్‌చుప్‌గా ఉంటున్నారు. నమ్మి మోసపోయామంటూ స్నేహితులు, బంధువుల వద్ద చెప్పుకుని బోరుమంటున్నారు తప్ప.. పోలీసుల వరకు రావడం లేదు.. వచ్చినా ఫిర్యాదు లేకుండా మార్గం చూడమని అడుగుతున్నట్లు తెలిసింది.
ఈ మధ్యకాలంలో మోడలింగ్‌పై ఉన్న ఆసక్తి, తల్లిదండ్రుల్లో ఉన్న ఉత్సాహాన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు.. ఆ బలహీనతలను ఆసరాగా చేసుకుని అందినంత డబ్బులు దోచుకుంటున్నారు. ఆన్లైన్ మోడల్హంట్ అనే పేరుతో సరికొత్త మోసాలకు తెరదీశారు. ఆన్లైన్లో సంప్రదింపుల తర్వాత టెలిగ్రామ్‌లో యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటారు. అటునుంచి కొన్ని డ్రెస్సులు పంపించి.. వాటిని ధరించి ఫొటోలు దిగమని.. అవి తమకు తిరిగి పంపాలని చెబుతారు. ఇదంతా పూర్తిగా నమ్మించేందుకు చేస్తుంటారు. అసలు తమను సంప్రదిస్తున్న వ్యక్తులెవరో కూడా బాధితులకు తెలియదు. వారు పంపిన డ్రెస్సులు వేసుకుని .. అందుకోసం కొన్ని డబ్బులు కట్టి ..తిరిగి ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు.
ఇదంతా పదినుంచి పదిహేనురోజుల వ్యవహారం. సైబర్ నేరగాళ్లు తమకు డబ్బులు దోచుకున్నాక… బాధితులు వారిని సంప్రదించాలని ప్రయత్నిస్తే స్పందించరు. దీంతో సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు వస్తుంటారు. ఇలాంటి కేసులు వారానికి ఒకట్రెండు, సైబర్వారియర్స్ వద్దకు 10-15 కేసులు వస్తున్నాయని సైబర్ పోలీసులు తెలిపారు. లక్షకుపైగా కోల్పోయిన వారు సైబర్‌క్రైమ్ పీఎస్‌కు , అంతకంటే తక్కువ కోల్పోయిన వారు లో కల్ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తున్నారని వారు చెప్పారు.