సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ ఉల్లంఘనలపై వచ్చే మెసేజ్‌లను సైబర్‌నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సాధారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు సదరు వాహనదారుడి సెల్‌ఫోన్‌కు ‘మీరు ఉల్లంఘనకు పాల్పడ్డారు’ అనే మెసేజ్ వస్తుంది. దీనిని ఆసరాగా చేసుకున్న సైబర్‌నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగికి ఇలాంటి మెసేజ్ పంపించి అతని క్రెడిట్ కార్డు నుంచి దఫ దఫాలుగా రూ. 2.58 లక్షలు కాజేశారు. నాచారానికి చెందిన బాధితుడి భార్య సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.
‘మీ వాహనం డిసెంబర్ 10వ తేదీన ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడడంతో ట్రాఫిక్ కెమెరా గుర్తించి చలాన్ వేసింది’ అంటూ జనవరి 13వ తేదీన మెసేజ్ వచింది. ఈ లింక్‌ను ఉపయోగించి మీ జరిమానా సెటిల్ చేసుకోండంటూ అందులో ఉంది. దీనిని పరిశీలించిన బాధితుడు నిజమేనని వెంటనే ఆ లింక్‌ను క్లిక్ చేసి అందులో తన క్రెడిట్ కార్డు వివరాలు పొందుపరిచాడు. ఇంతలోనే ఆ క్రెడిట్ కార్డు నుంచి రెండు దఫాలుగా రూ. 2,58,360 రెండు వేర్వేరు ఖాతాలలోకి బదిలీ అయ్యాయి. సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లను చూసి షాక్‌కు గురైన బాధితుడు వెంటనే మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.