Maha Kumbh Mela | బంజారాహిల్స్,ఫిబ్రవరి 23: ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో గదులు ఇప్పిస్తామంటూ నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు దండుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఆనంద్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారి కుమార్ రామచంద్రన్ అనే వ్యక్తి కుంభమేళాకు వెళ్లాలనుకుని అక్కడ గదులు దొరుకుతాయేమో అని ఈ నెల 7న ఆన్లైన్లో సెర్చి చేయడం ప్రారంభించాడు. ‘మహాకుంభ టెంట్ ప్రయాగ్‌రాజ్’ అనే పేరుతో ఉన్న ఓ వెబ్సైట్లోకి లాగిన్ కాగానే ఒక ఫోన్ నెంబర్ కనిపించింది.
ఆ నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగా ఫిబ్రవరి 9నుంచి 10 దాకా టెంట్ సిటీలో గదులు సిద్దంగా ఉన్నాయని, వెంటనే బుక్ చేసుకోవాలని చెప్పారు. రెండు రూమ్స్ కోసం రూ.30వేలు చెల్లించాలని చెప్పగా వారు సూచించిన అకౌంట్‌కు పంపించాడు. 10 నిమిషాల్లో బుకింగ్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ వస్తుందని చెప్పారు. అయితే గంటలు గడిచినా వారినుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో అనుమానం వచ్చిన కుమార్ రామచంద్రన్ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ సూచనల మేరకు ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.