సైబర్ నేరగాళ్ల నయా ఎత్తుగడలు
సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారుల డీపీలు పెట్టుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు గిఫ్ట్ కార్డులంటూ లింక్‌లు పంపిస్తున్నారు. లింక్‌ను క్లిక్ చేయగానే ఖాతాలు ఖాళీ అయ్యే విధంగా మోసాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్లితే.. ఐఅండ్‌పీఆర్ జాయింట్ డైరెక్టర్ డి.జగన్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి మున్సిపల్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ డీపీతో కూడిన ఓ నంబర్‌తో www.amazon.in., amazon-mail-pay-gift-card అంటూ లింక్‌లు వచ్చాయి. వాటిని క్లిక్ చేస్తే మీరు బహుమతులు పొందవచ్చని వివరించారు.
దీంతో అనుమానం వచ్చిన జగన్ వెంటనే ఈ విషయాన్ని హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ డీపీతో గుర్తు తెలియని మోసగాళ్లు ఇలా లింక్‌లు పంపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.