Cyber Crime : బంజారాహిల్స్, మే 29 : కార్పొరేట్ ఆస్పత్రి సీఎండీ పేరుతో భారీగా నగదు కాజేద్ధామనుకున్న సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) ప్రయత్నం భగ్నమైంది. సీఎండీ వాట్సప్ డీపీ పెట్టుకుని సదరు సంస్థకు చెందిన అధికారి వద్ద నుంచి రూ.22 లక్షలు కాజేసేందుకు దుండగులు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వికాస్ మహేశ్వరికి ఈనెల 14న ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆస్పత్రి సీఎండీ డా.రమేష్ కంచర్ల పేరుతో పాటు ఆయన డీపీతో ఉన్న ఆ వాట్సాప్ మెసేజ్‌ను ఓపెన్ చేయగా.. అర్జెంట్‌గా దేవ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ అకౌంట్ నెంబర్‌కు రూ.22 లక్షలు పంపించాలని ఉంది. అయితే.. అనుమానం వచ్చిన వికాస్ వెంటనే తమ సీఎండీకి ఫోన్ చేశారు. ఆయన వాట్సాప్ డీపీతో మెసేజ్ వచ్చిందని.. అందులో వెంటనే రూ.22 లక్షలు పంపించాలని ఉందని తెలియజేశాడు.
కానీ, సంస్థ సీఎండీకి తాను ఎలాంటి మెసేజ్ పంపలేదని చెప్పడంతో అది సైబర్ నేరగాళ్ల పని అని భావించారిద్దరూ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సీఎండీ, వికస్. వీరిచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. డబ్బులు పంపించాలంటూ వికాస్‌కు దుండగులు పంపిన వాట్సాప్ మెసేజ్లోని బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆరా తీశారు. ఆ బ్యాంక్ ఖాతా రాంచీలో ఉన్నట్టు గుర్తించారు. బీఎన్ఎస్ 319(2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ వాట్సాప్ మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.