సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల ప్రధాన టార్గెట్ హైదరాబాద్ నగరంగా ఎంచుకున్నట్లు ఈ ఏడాదిన్నర కాలంలో నమోదైన కేసులే చెబుతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా లేనంతగా ఒక్క నగరంలోనే గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 70వేల కేసులు నమోదయ్యాయి. నగరంలో ప్రైవేటు బ్యాంకులు పెరిగిపోవడం, రిక్రూట్మెంట్లలో ఎవరిని పడితే వారిని తీసుకొని.. తమ టార్గెట్లను చేరుకోవడానికి బ్యాంకులు చూపిస్తున్న అత్యుత్సాహం.. సైబర్‌నేరాలు పెరగడానికి కారణమవుతున్నదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 23,279, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27,132, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16,871 కేసులు నమోదయ్యాయి.
ఇటీవల సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో రిలేషన్షిప్ సేల్స్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.1.28 కోట్లు కొట్టేసిన కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లకు టెలీగ్రామ్ ద్వారా బ్యాంక్ ఖాతాలు ఇస్తూ కమీషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాలకు గురైన ఖాతాదారులను పరిశీలిస్తే ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఖాతాలను కలిగి ఉన్నవారే ఎక్కువ అని బయటపడింది. నేషనలైజ్డ్ బ్యాంకుల్లో సైబర్ బాధితుల సంఖ్య ఉన్నప్పటికీ ప్రైవేటుతో పోలిస్తే తక్కువేనని పోలీస్ అధికారులు చెప్పారు. సైబర్‌నేరగాళ్లకు సహకరించేవారికి అకౌంట్స్ ఇవ్వడం, అకౌంట్స్ ద్వారా దొంగిలించిన సొమ్మును విదేశాలకు చేర్చడం, వాటిని క్రిప్టో కరెన్సీలోకి మార్చడం వంటివి బ్యాంకు సిబ్బంది చొరవతో మాత్రమే జరుగుతున్నదని ఒక సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు. ఇటీవల సైబర్ సెక్యూరిటీ అధికారులు 52 మంది నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరు దేశవ్యాప్తంగా 576 మోసాల్లో రూ. 88.32 కోట్లు కొట్టేశారు. నిందితుల్లో నలుగురు బ్యాంక్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు నేపాల్, చైనాలోని నేరగాళ్లకు రూ.23 కోట్లు బదిలీ చేసినట్లు తేల్చారు.
సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ, ఇతర లావాదేవీలకు మ్యూల్‌ఖాతాలు వినియోగిస్తారు. వేరే వారిపేరుతో ఉన్న ఈ ఖాతాలు వాడితే నేరగాళ్లు చిక్కకుండా ఖాతాదారు మాత్రమే చిక్కుతారు. ఇప్పుడు జరుగుతున్న నేరాల్లో ఇదే కీలకంగా మారింది. సైబర్ నేరగాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా నిరుపేదలు, నిరక్షరాస్యుల పేర్లతో ఖాతాలు తెరిపించి వాటిని వాడుకునే వారు. ఇలాంటి ఖాతాలపై నజర్ పెట్టాల్సిన సిబ్బంది కమీషన్లకు ఆశపడి చూసీచూడనట్లు వదిలేయడంతో ఆయా ఖాతాల్లో కోట్ల రూపాయలు జమకావడం, గంటల వ్యవధిలో మాయం కావడం జరుగుతోంది.
బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పార్ట్‌టైం జాబ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ కస్టమర్ కేర్, డెబిట్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఫ్రీ ఆఫర్స్, కేవైసీల పేరుతో సైబర్ క్రైమ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేరాలన్నింటీలో బ్యాంకు ఖాతాలే కీలకం కాగా, బ్యాంక్ సిబ్బందిలో కొందరు ఈ వివరాలు సైబర్ నేరగాళ్లకు ఇస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. అర్హతలు లేకున్నా కరెంట్ ఖాతాలు ఇవ్వడం, నేరుగా కమీషన్ల కోసం నకిలీ పత్రాలతో ఖాతాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు 5 నుంచి10 శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అసలు నేరగాళ్లు దొరకకుండా ఖాతాదారులే దొరుకుతుండడంతో సైబర్ నేరాలు ఆగడం లేదని పోలీసు అధికారి ఒకరు అన్నారు.