Cyber Crime | సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే సైబర్ కేటుగాళ్లు లక్ష రూపాయలు కొట్టేశారు.. అది ఎలా జరిగిందని ఆరా తీస్తే సైబర్ మోసం బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (31), తనకు సంబంధించిన మూడు మొబైల్ నెంబర్లను ఉపయోగించి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా శ్రీశైలం వైశ్యసత్రంలో గదులు బుక్ చేసుకున్నాడు. గదికి రూ.1000 కాగా దానిని బాధితుడు చెల్లించాడు.
తర్వాత బాధితుడికి రూ.180 అదనంగా జీఎస్టీ చార్జీలు చెల్లించాలని అభ్యర్థిస్తూ కాల్ వచ్చింది. అప్పటికే జీఎస్టీ చెల్లించనందున అతనికి రూమ్ బుక్ కాకపోవడంతో తాను చెల్లించిన మొత్తాన్ని రిటర్న్ చేయాలని కోరాడు. అక్కడ కాల్ చేసిన వ్యక్తి రీఫండ్ ప్రక్రియ కోసం రూ.1 చెల్లించాలని అడగగా బాధితుడు చెల్లించాడు.
తర్వాత తన అకౌంట్లో లక్షరూపాయలు లేకపోవడాన్ని గమనించి వెంటనే తనకు కాల్ చేసిన వ్యక్తులను సంప్రదించగా వారు స్పందించకపోవడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇటువంటి మోసాలు ఒక్క తెలుగురాష్ర్టాల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ముందునుంచి చార్ధామ్ వసతులు, ఇతర సౌకర్యాల పేరుతో ఈ సంవత్సరం ఆన్లైన్ సేవలు పెరిగిపోయాయి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎక్కువగా ఈ సేవలందించే సైట్లే కనిపిస్తున్నాయి.తమకు అనుకూలంగా ఉంటుంది కదా అని నమ్మి అడుగేస్తే మోసపోయే అవకాశముంటుందని సైబర్ పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో రకరకాలుగా మోసాలు చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ తాజాగా ఆధ్యాత్మిక పర్యాటకంపై కన్నేశారు. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులను టార్గెట్‌గా చేసుకుంటూ మోసాలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఈ తరహా నేరాలు జరుగుతుండడంతో సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ అలర్ట్ అయింది. ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకుని 33 రకాలుగా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఒక్క తెలంగాణ నుంచే ఏటా రూ.700 కోట్లు కొల్లగొడుతున్నట్లు ఇటీవల సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ ప్రకటించింది.
కేదార్నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్‌లు, చార్ధామ్ యాత్రికులకు గెస్ట్ హౌజ్‌లు, హోటల్బుకింగ్లు, క్యాబ్ సర్వీసులు అందిస్తామంటూ ఫేక్ వెబ్సైట్లు, ఫేస్ బుక్ పోస్టులు పెట్టి మరీ మోసాలు చేస్తున్నారు. గూగుల్ తరహా సెర్చ్ ఇంజన్లలో ప్రకటనలు ఇస్తూ వందల మందిని బోల్తా కొట్టిస్తున్నారు. హాలిడే ప్యాకేజిల పేరిట టోకరా ఇస్తున్నారు. వీరి వలలో చిక్కి చెల్లింపులు చేస్తున్న వారికి ఆ తరువాత అందాల్సిన సేవలు అందడం లేదు.
సాధారణంగా ప్రజలు చార్ధామ్ పర్యటనలకు వెళ్తే ముందుగానే హెలికాప్టర్ బుకింగ్స్, హోటల్‌గదులు, క్యాబ్ సేవలు వంటివాటిని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. దీనిని సైబర్ ముఠాలు అవకాశంగా తీసుకుని ఫేస్బుక్, గూగుల్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో స్పాన్సర్డ్ అన్న పేరుతో నకిలీ యాడ్స్ వేస్తున్నారు. అలా లింక్‌లపై క్లిక్ చేసిన వారిని నమ్మదగని వెబ్సైట్లకు మళ్లించి ముందస్తు చెల్లింపులు తీసుకుంటున్నారు.
కేవలం వెబ్సైట్లు మాత్రమే కాదు.. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాముల వంటి వేదికల ద్వారా వ్యక్తిగతంగా మేసేజ్‌లు రావడం, ఆఫర్లో చార్ధామ్ ప్యాకేజి, హెలికాప్టర్ టికెట్లు తగ్గింపు ధరలో లభ్యం అనే మాటలు చెబుతూ భక్తుల నమ్మకాన్ని దోచుకుంటున్నారు. కొన్ని ఫేక్ ట్రావెల్ ఏజెన్సీలు గూగుల్ రిజిస్టర్లతో కూడిన నకిలీ లింకులు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. బాధితులు తాము అంతదూరం వెళ్లి సదుపాయాలు తీసుకోవడం కష్టం కాబట్టి ముందుగానే ఆన్లైన్లో రిజర్వ్ చేసుకుని వెళ్తే ప్రయాణం సుఖవంతమవుతుందని భావిస్తున్నారు.
అయితే ఆన్లైన్లో తాము బుక్ చేసుకున్న తర్వాత ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడం, ఫోన్‌నెంబర్లు పనిచేయకపోవడం, రీఫండ్ అవకాశం లేకపోవడం వంటి సమస్యలుఎదుర్కొంటున్నారు. అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారానే బుకింగ్స్ చేయాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు. bit.ly, tinyurl వంటి యూ రెల్స్ లింక్స్‌ను నమ్మవద్దని, సమస్య వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని వారు సూచించారు. .