Cyber Crime | సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ): వెయ్యి రూపాయలు లాభం వచ్చిందంటూ ఇచ్చి నగరానికి చెందిన ఓ వ్యాపారి వద్ద సైబర్ నేరగాళ్లు రూ. 1.38 కోట్లు కొట్టేశారు. ట్రేడింగ్ పేరుతో వాట్సాప్‌కు మెసేజ్ పంపించిన సైబర్‌నేరగాళ్లు బాధితుడికి అధిక లాభాలిప్పిస్తామని నమ్మించి నిండా ముంచేశారు. వనస్థలిపురం హరిహరపురం కాలనీకి చెందిన బాధితుడు వృత్తి రీత్యా వ్యాపారి. జూన్ 21వ తేదీన బాధితుడి ఫోన్ నెంబర్‌ను ‘డీ18 ఇండియా స్టాక్ పండిట్స్ సర్కిల్’ వాట్సాఫ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ తరువాత గ్రూప్ అడ్మిన్లు సురభి గుల్షన్ సింగ్, సొబ్టి అనే వ్యక్తులు ఫోన్ చేసి ‘మేం ట్రేడింగ్ చేస్తున్నాం, మీకు అమెరికా, ఇండియా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లపై మెలుకువలు చెబుతామంటూ’ నమ్మించారు.
ఆ తరువాత ‘దేవ ఏ టీమ్ 17’ అనే మరో వాట్సాఫ్ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో రోజు వారిగా స్టాక్స్ వివరాలు చెబుతామని, అయితే మీరు ట్రేడింగ్ చేయాలంటే ముందుగా తాము పంపించే లింక్‌ను క్లిక్ చేసి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, యూజర్‌నేమ్, పాస్వర్డ్లు క్రియేట్ చేసుకున్నాడు. అప్పటికే నెల రోజులు గడిచింది. జులై 21వ తేదీన క్యాంట్లిన్ క్యాప్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో రూ. 50 వేలు వెచ్చించి స్టాక్స్ కొనుగోలు చేశాడు. అందులో వెయ్యి రూపాయలు లాభం వచ్చిందంటూ ఆ డబ్బును బాధితుడి ఖాతాలో డిపాజిట్ చేశారు. దీంతో బాధితుడికి వాళ్లపై నమ్మకం బలపడింది. మరుసటి రోజు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయడంతో స్క్రీన్‌పై రూ. 4 లక్షల లాభం కన్పించింది, దీంతో మరో రూ. 3 లక్షలు డిపాజిట్ చేశాడు.
వెంటనే మీరు ఇనిస్టిట్యూషనల్ స్టాక్స్ కొనేందుకు అర్హత సాధించారంటూ నమ్మించారు. మీకు 3800 షేర్స్ అలాట్ చేస్తున్నామంటూ రూ. 8.5 లక్షలు డిపాజిట్ చేయించారు. వాటివల్ల రూ.17 లక్షల లాభాలు కన్పిస్తున్నాయి. ‘మీ వ్యాలెట్‌కు మేం లోన్ల ద్వారా ఫండ్స్ జమ చేస్తామని, మీరు ఇన్వెస్ట్ చేయండని’ ప్రోత్సహించారు. రూ. 1.73 కోట్ల విలువైన 7080 షేర్స్ మీకు అలాట్ చేస్తున్నామంటూ స్క్రీన్‌పై చూపించారు. వాటి వల్ల లాభం రూ. 3.5 కోట్లు వచ్చినట్లు నమ్మించారు.
దీంతో బాధితుడు రూ. 65 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు, రెండు మూడు రోజుల తరువాత మీ అకౌంట్ పాజిటివ్‌గా ఉందని రూ. 5.2 కోట్ల విలువైన షేర్స్‌ను మీకు కేటాయిస్తున్నామంటూ దానికి లోన్ వస్తుందంటూ నమ్మించారు. మరుసటి రోజు మొత్తం లాభాలు రూ. 40 కోట్లకు చేరుకున్నాయంటూ నమ్మించారు. దీంతో బాధితుడు రూ. 25 లక్షల వరకు నేరగాళ్లు సూచించిన ఖాతాలో డిపాజిట్ చేశాడు. అప్పటికే దఫ దఫాలుగా బాధితుడు రూ. 1,38,30,000 డిపాజిట్ చేయగా అందులో అప్పటి వరకు వెయ్యి రూపాయలు మాత్రమే తిరిగి వచ్చాయి.
స్క్రీన్‌పై రూ. 40 కోట్లు ఉన్నట్లు కన్పిస్తుండగా, అందులో నుంచి రూ.4.6 కోట్లు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు విత్ డ్రా చేసుకోలేరని, మీ లాభాలపై 5 శాతం కమిషన్ అంటే రూ.1.7 కోట్లు చెల్లించిన తరువాతే మీకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మెలిక పెట్టారు. నా వద్ద ఉన్న ఫండ్స్ మొత్తం పెట్టుబడి పెట్టానని, నా వ్యాలెట్‌లో నుంచి కమిషన్ మినహాయించుకొని డబ్బులు ఇవ్వాలని బాధితుడు కోరాడు. అది కుదరదు, కమిషన్ చెల్లిస్తేనే డబ్బు విత్‌డ్రా చేసుకోగలరని తేల్చి చెప్పారు. వాళ్ల వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి, అనంతరం రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.