సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.92 కోట్లు కొట్టేసిన ఘటనలో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 71ఏండ్ల వృద్ధుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, సీబీఐ ఆఫీసర్‌నంటూ నిందితుడు మాట్లాడి బాధితుడి పేరుమీద ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం కార్డు చూపించి తనపై ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్‌లో కేసు నమోదైందని చెప్పి నకిలీ ఎఫ్ఐఆర్ చూపించారు.
దీంతో బాధితుడు భయపడగానే నిందితులు ఈ కేసును సెటిల్ చేసుకోవాలని డబ్బులు పంపాలని చెప్పడంతో వారు చెప్పిన అకౌంట్లకు విడతల వారీగా ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య రూ.1.92 కోట్లు పంపినట్లు తెలిపారు. తాను మోసపోయానని గ్రహించి బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.నలుగురు నిందితుల్లో సందీప్ అలియాస్ అలెక్స్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారని , మిగతా ముగ్గురు మహబూబ్‌నగర్‌కు చెందిన పాండు వినీత్రాజ్ అలియాస్ పాండు అనిల్‌కుమార్, తిరుపతయ్య , గౌని విశ్వనాథంలను పోలీసులు అరెస్ట్ చేశారు.