సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): చైనా దేశస్తులు అడిగారని బ్యాంకు ఖాతాలు తెరిచి, పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన అడబాల శ్రీనివాసరావు అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, నల్లకుంటకు చెందిన విజయకృష్ణ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఈ ఇద్దరికి కొందరు చైనీయులతో పరిచయాలున్నాయి. భారత్‌లో వ్యాపారం చేయాలంటే కంపెనీ పేర్లు కావాలని..దీంతో పాటు బ్యాంకు ఖాతాలు కావాలంటూ చైనీయులు కోరారు. కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయిస్తే.. దానికి మీరే డైరెక్టర్లుగా ఉంటారంటూ.. నమ్మించారు. ఇద్దరితో రెండు కంపెనీల పేర్లు రిజిస్ట్రేషన్ చేయించి, వాటి ద్వారా రెండు బ్యాంకు ఖాతాలు తెరిపించారు. నగరానికి చెందిన ఓ మహిళ మాల్008.కామ్ యాప్ లింక్ క్లిక్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఉద్యోగాలున్నాయంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాని క్లిక్ చేయగానే టెలిగ్రామ్ ద్వారా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచనలు వచ్చాయి.
అయితే ఉద్యోగం కంటే కొంత పెట్టుబడి పెడితే కమీషన్ వస్తుందంటూ.. అందులో సూచనలు రావడంతో ఆమె వెబ్సైట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో కొంత పెట్టుబడి పెట్టగానే వెంటనే నిర్వాహకులు కొంత కమీషన్ అంటూ చెల్లించారు. ఆ తర్వాత రూ.2.5 లక్షలు మోసం చేయడంతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు డబ్బులు చెల్లించిన విధానాన్ని పోలీసులు గుర్తించారు. సైబర్‌నేరగాళ్లు నయా పంథాలో ఒక క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే..ఒక్కోసారి ఒక్కో బ్యాంకు ఖాతాకు లింక్ అయ్యే విధంగా ప్రోగ్రాంను సెట్ చేశారు. సైబర్‌క్రైమ్ పోలీసులు ఆ క్యూ ఆర్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాలను ఆరా తీశారు. మొత్తం 10 బ్యాంకు ఖాతాలతో మాల్008.కామ్‌కు అనే నకిలీ వెబ్‌సైట్‌కు లింక్ అయినట్లు గుర్తించి, ఆయా ఖాతాల వివరాలను సేకరించారు. అందులో రెండు అకౌంట్లు హైదరాబాద్‌కు చెందినవి కావడంతో వాటిపై ఆరా తీశారు. వాటిని నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను శనివారం రాత్రి అరెస్టు చేశారు.